పల్లె ప్రగతిలో భాగంగా చివ్వెంల మండల పరిధిలోని అక్కలదేవిగూడెం
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్రాలీ, వీధుల్లో ఏల్ఈడీ లైట్లు ఇలా అన్ని మౌలిక వసతులు సమకూర్చుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు అందజేయడంతో స్థానిక సమస్యలను పంచాయతీ పాలకవర్గం సకాలంలో పరిష్కరిస్తున్నది. హరితహారంలో భాగంగా సూర్యాపేట ఖమ్మం రహదారిపై నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
అక్కలదేవిగూడెంలో పూర్తిగా ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన కరెంట్ లైన్లు, నిత్యం కరెంట్ కష్టాలే ఉండేవి. అయితే, పల్లె ప్రగతిలో భాగంగా స్తంభాలతో పాటు లైన్లకు మరమ్మతులు పూర్తి చేసి లో ఓల్టేజీ సమస్య రాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. గతంలో చివ్వెంల పంచాయతీ పరిధిలో ఉండడంతో సమస్యల పరిష్కారానికి ఎదురుచూడాల్సి వచ్చేది. నీళ్లు కావాలంటే వ్యవసాయ బావులు, బోరు బావుల నుంచి తెచ్చుకునేవారు. ప్రస్తుతం ఇంటింటికీ నల్లాలు పెట్టి నీళ్లు అందిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా వెనువెంటనే పరిష్కారం అవుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీలోని ప్రభుత్వ స్థలంలో రూ.12.60లక్షలతో వైకుంఠధామం, రూ.15లక్షలతో సీసీ రోడ్లు, రూ.2.60లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.1.60లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.10లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు.
పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరుగా అందించేందుకు గ్రామస్తులకు రెండు బుట్టలు అందించి అవగాహన కల్పించారు.
అక్కలదేవిగూడెంలో ఉపాధి హామీ నిధులతో రూ.1.60లక్షలు, సుమారు ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 15రకాలకు చెందిన 900మొక్కలు నాటారు. మర్రి, వేప, చింత, తులసి, గిన్నె, జామ, ఉసిరి, దానిమ్మ, మామిడి, బొప్పాయి, సీమ తంగేడు, గుల్మెహర్, గులాబీ, మల్లె, నంది వర్ధనం మొక్కలు నాటారు. హరిత హారంలో మొక్కలు నాటేందుకు నర్సరీ ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం..
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. మా గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, పల్లె ప్రగతి ద్వారా నెలనెలా నిధులు రావడంతో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతున్నది. గ్రామస్తుల సహకారంతో ఊర్లో సమస్యలు పరిష్కరించుకుంటున్నాం.
గ్రామంలో పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో సకాలంలో పూర్తి చేశాం. రెండేండ్లలోనే గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిత్యం పారిశుధ్య పనులతో గ్రామం కళకళలాడుతున్నది.