e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home జిల్లాలు జాగ్రత్తగా ఓటేయండి

జాగ్రత్తగా ఓటేయండి

జాగ్రత్తగా ఓటేయండి

నల్లగొండ ప్రతినిధి/హాలియా, ఏప్రిల్‌ 16 (నమస్తే తెలంగాణ) : సాగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రానికే పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో సహా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఓటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా కేంద్రం ఆవరణలోనూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా క్యూలైన్లలో భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ చేశారు. మొత్తం 2,20,300మంది ఓటర్లు ఉండగా నియోజకవర్గ వ్యాప్తంగా 346పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3145మంది పోలింగ్‌ సిబ్బంది, 4వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లతో పాటు సిబ్బంది అందరూ మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేశారు.
అదనపు ఈవీఎంల వినియోగం…
ఈవీఎంల వినియోగం తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభ్యర్థులు అత్యధికంగా పోటీ చేస్తున్నది ఈ ఉప ఎన్నికల్లోనే. 41మంది బరిలో నిలువడంతో అదనపు సామగ్రి అవసరం పడింది. ఓటు వేసే ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్లను అదనంగా వినియోగిస్తున్నారు. సాధారణంగానైతే ఒక్కో కంట్రోల్‌ యూనిట్‌, ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ వినియోగిస్తే సరిపోయేది. కానీ ప్రస్తుతం కంట్రోల్‌ యూనిట్ల సంఖ్య అంతే ఉన్నా… బ్యాలెట్‌ యూనిట్ల సంఖ్య మూడింతలైంది. ఓటు వేసే ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16మంది అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులకే అవకాశం ఉంటుంది. సాగర్‌ ఉప ఎన్నికల్లో 41మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో 16మందికి ఒకటి చొప్పున మొత్తం మూడు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తున్నారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఒక కంట్రోల్‌ యూనిట్‌నే వినియోగిస్తారు. కానీ ఓటరు ఓటు వేసే కంపార్ట్‌మెంట్‌లో మాత్రం వరుసగా పక్కపక్కనే మూడు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. వరుస క్రమంలో మొదటి యూనిట్‌లో 1 నుంచి 16 మంది, రెండో యూనిట్‌లో 17నుంచి 32 మంది, మూడో యూనిట్‌లో 33నుంచి 41వ చివరి అభ్యర్థితో పాటు నోటాను కూడా పొందుపరిచారు. అందుకే ఓటర్లు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఓటు వేయక తప్పదు.
గందరగోళానికి గురికాకుండా..
మూడు ఈవీఎంలు వినియోగిస్తున్న నేపథ్యంలో ఓటర్లు ఆందోళనకు గురికాకుండా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో డమ్మీ సామగ్రిని చూపించారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఓటరును కలిసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు మొదటి ఈవీఎంలోని మూడో నెంబర్‌లో కారు గుర్తు ఉంటుందని ఒకటికి రెండుసార్లు చూపించారు. ఇక ఒక గుర్తుకు మరో గుర్తుకు దగ్గరి పోలికలు కూడా అభ్యర్థుల్లో ఆందోళన కల్గిస్తున్నది. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో కారును పోలిన రోలర్‌, ట్రాక్టర్‌ గుర్తులకు పెద్ద ఎత్తున ఓట్లు పోలవ్వడం విదితమే. ఈ సారీ ఆ పరిస్థితి లేకపోలేదు.
ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి…
ఓటర్లు ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డుతో పాటు ఓటరు స్లిప్పును తమ వెంట తెచ్చుకోవాల్సిందే. నేడు ఉదయం 7గంటలకు మొదలయ్యే పోలింగ్‌ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. కొవిడ్‌ నేపథ్యంలో అదనంగా రెండు గంటల సమయాన్ని పొడిగించారు. భౌతికదూరం పాటించడం, ఓటు వేసేందుకు ఒక్కో ఓటరుకు అదనపు సమయం ఇవ్వాల్సి వస్తుండడమే ఇందుకు కారణం. మాస్కు ఉంటేనే ఓటు వేసేందుకు రావాలని స్పష్టం చేశారు. ఈవీఎంలలోని బటన్లను నొక్కేందుకు ప్లాస్టిక్‌ గ్లౌస్‌ను అందించనున్నారు. అదేవిధంగా అన్ని చోట్లా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఎండవేడిమితో పాటు కొవిడ్‌తో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేలా ఆదేశించారు. ఇక రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రానికి 200మీటర్ల దూరంలో తమ ప్రచారాన్ని కొనసాగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

సాగ‌ర్ ఉపఎన్నిక భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ రంగనాథ్ స‌మీక్ష

Advertisement
జాగ్రత్తగా ఓటేయండి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement