పంద్రాగస్టు సంబురాలు అంబరాన్నంటాయి. వాడవాడలా సంస్థలు, కార్యాలయాల ఆవరణలో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 75వ స్వాత్రంత్య్ర దినోత్సవాలకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తి గేయాలకు విద్యార్థుల నృత్య రూపకాన్ని తిలకించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో జెండావిష్కరణ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో పలు ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. అధికారులు, సిబ్బంది తమ శకటాల నమూనాల ముందు నడిచారు. 78 మీటర్ల వెడల్పు 110 మీటర్ల పొడవుతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా వేడుకల్లో హైలెట్‌గా నిలిచింది.
వివిధ ప్రభుత్వ శాఖలు, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి స్టాల్‌ను సందర్శించి ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇమాంపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ శానిటైజేషన్, కరోనా పేషెంట్లకు మెడిసిన్, ఆహార పదార్థాలు అందించేందుకు రూపొందించిన ఎలక్ట్రిక్ రోబోను పరిశీలించి అభినందించారు.