అహింసా మార్గంలో సాధించిన దేశ స్వాంతంత్య్ర, తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందరికీ అందుతున్నాయి.. పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి.. దళితుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలవుతున్నాయి.. కొత్తగా దళిత బంధుకు అడుగులు పడ్డాయి.. సాగునీరు, ఉచిత విద్యుత్‌తో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి పంటల దిగుబడిలో సూర్యాపేట జిల్లా ముందంజలో ఉంది. రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ
ముబారక్, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక భరోసా ఏర్పడింది’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ
పథకాల ప్రగతిని వివరించారు.
సూర్యాపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర ఫలాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కూడా నేడు ప్రజలకు అందుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో ఇంచు భూమి కూడా వదలకుండా సాగవుతోందని, ఈ వానకాలంలో సాధారణ విస్తీర్ణం 4.88లక్షల ఎకరాలైతే అది పెరిగి 6.60లక్షల ఎకరాలకు చేరుకుంటున్నదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు రూ.25 వేలలోపు ఉన్న 14,600 మంది రైతుల రుణాలు రూ. 18.25కోట్లు రుణమాఫీ కాగా తాజాగా రూ.50వేల లోపు 27,658మంది రైతులకు చెందిన రూ.86.96కోట్లు మాఫీ అయ్యాయని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా జిల్లాలో 82 రైతు వేదికలు మంజూరు కాగా ఇప్పటికే 81పూర్తయినట్లు చెప్పారు. రూ.31కోట్లతో 4,500పంట కల్లాల నిర్మాణాలకు ఇప్పటివరకు 800 పూర్తి చేసినట్లు తెలిపారు. గత యాసంగిలో 81,733 మంది రైతుల నుంచి 6.61లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు, పంట నిల్వకు 35వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 13 గోదాములు రూ. 52 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు.
ప్రభుత్వం రైతులకు ధైర్యం ఇస్తూ రైతుబంధు ద్వారా ప్రతి ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని 2,52,655 మందికి రూ.307 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు అనుకోని పరిస్థితిలో మృత్యువాత పడితే ఆ కుటుంబానికి భరోసా కల్పించేలా రైతుబీమా ద్వారా రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1970 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.98.50కోట్లు చెల్లించినట్లు చెప్పారు.
సమీకృత ఉద్యానవన అభివృద్ధ్ది పథకంలో భాగంగా పండ్లు, కూరగాయలతో పాటు ఆయిల్ పాం, పట్టు పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జిల్లాలో 600హెక్టార్లలో ఆయిల్ పాం సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 88 మంది రైతులు 603 హెక్టార్లలో పెంచేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. 162 ఎకరాల్లో మల్బరీ సాగులో ఉండగా ఈ ఏడాది మరో 180 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
దళారీ వ్యవస్థను రూపుమాపడానికి 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది 1380 నీటి వనరుల్లో 4.17 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. యాదవులకు గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 17,133 యూనిట్లకు గానూ 214 కోట్ల రూపాయలతో 3.60లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రెండో విడుతలో 17,622 మంది లబ్ధిదారులకు రూ. 318 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏనాడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చెరువుల పునరుద్ధరణ, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఎస్ఆర్ఎస్పీ రెండో దశలో 2,13,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని, నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా 2,29,061 ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నదని మంత్రి తెలిపారు. నాలుగు విడుతల్లో రూ. 560 కోట్లతో జిల్లాలోని అన్ని చెరువులను ఆధునీకరించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల రావడం, కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు. హుజూర్‌నగర్‌కు ఇచ్చిన హామీల్లో భాగంగా అక్కడ ముగ్గురు డాక్టర్లతో ఈఎస్ఐ దవాఖాన మంజూరు చేసినందుకు సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది కాలంలో జిల్లాలోని 4 ఆస్పత్రుల ద్వారా ఆరోగ్య శ్రీ సేవలు అందించగా రూ.17 కోట్లతో 7,900 మందికి చికిత్స అందించినట్లు చెప్పారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి అదనపు, కొత్త లైన్లు, స్తంభాలు వంటి పనులు చేపట్టడంతో జిల్లాలో విద్యుత్ సమస్య లేకుండా పోయిందన్నారు. జిల్లాలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో 1.34 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతుండగా రూ. 24.68 కోట్ల వ్యయంతో ఈ ఏడాది 3500 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రూ. 7.73 కోట్లతో 1288 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, రూ. 39 కోట్లతో 787 కిలోమీటర్లు 11 కేవీ, ఎల్టీ లైను, 5300 పోల్స్, విరిగిపోయిన వాటి స్థానంలో కొత్త పోల్స్ వేసినట్లు తెలిపారు. రూ.2 కోట్లతో జిల్లా స్టోర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో రూ.2 కోట్లతో 33 కేవీ ఫీడర్ పనులు జరుగుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రెండేళ్లలో 208 కోట్ల రూపాయలతో 475 పంచాయతీల్లో 679 పల్లె ప్రకృతి వనాలు, 475 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వం కల్యాణలక్ష్మి, శాదీ ముబారక్ పథకాల ద్వారా జిల్లాలోని పేదల ఇళ్లల్లో ఆనందం నిండిందన్నారు. ఇప్పటి వరకు 24,760 మందికి రూ. 215 కోట్లు అందించినట్లు చెప్పారు. జిల్లాలో 1.23లక్షల మందికి పించన్లు, 3.17లక్షల అహార భద్రతా కార్డుదారులకు ప్రతినెలా 5,927 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నామన్నారు. 9,400 మందికి కొత్తగా ఆహారభద్రతా కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్లు హేమంత్ పాటిల్, మోహన్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, పట్టణ అధికారులు, ఉద్యోగులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాల్టీల్లోని 168 పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ. 9.47కోట్ల రుణాలను విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, మెప్మా పీడీ రమేశ్‌నాయక్, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్, మెప్మా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములై పట్టణంలోని చిరు వ్యాపారులకు అత్యధికంగా రుణాలు మంజురు చేసిన బ్యాంకు అధికారులకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రశంసా పత్రాలు అందజేశారు.