సూర్యాపేట సిటీ, ఆగస్టు 14 : విద్యాలయాల్లో భావి పౌరులుగా రూపుదిద్దుకోవాల్సిన వారు బాలకార్మికులుగా బందీ అవుతున్నారు. ఇలాంటి చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి జీవితంలో వెలుగు నింపడానికి ప్రభుత్వాలు ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏడాది అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పనిచేస్తున్న బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 1 నుంచి 31వరకు జిల్లాలో అధికారులు ముస్కాన్-7 నిర్వహించారు. ఐదు శాఖలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా వివిధ దుకాణాలు, ఇటుక బట్టీలు, కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్త ంగా 75మంది బాల కార్మికులను గుర్తించి వారిని పని నుంచి విముక్తి కల్పించారు. ఇందులో 66మంది బాలురు, 9మంది బాలికలు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఒడిశాకు చెందిన వారు కాగా మిగిలిన వారు జిల్లాకు చెందిన వారు. బాధ్యులైన ఏడుగురిపై కేసులు నమోదు చేయగా 35మంది బాలలను పనిలో పెట్టుకున్న కారణంగా ఆయా కంపెనీల వారికి కార్మికశాఖ నోటీసులు పంపించింది.
కొందరు చిన్నారులు నిర్బంధ శ్రమంతో మగ్గిపోతున్నారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వెనుకబాటు, నిరక్షరాస్యత ఇలా పలు రకాల కారణాలతో కొందరు చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇలాంటి వారిని నిర్బంధం నుంచి విడిపించడానికి ప్రతి ఏటా ఆపరేషనన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పోలీసు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, కార్మిక, చైల్డ్ లైన్, రెవెన్యూ శాఖల్లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వీరు కిరాణ, మెకానిక్, వివిధ పరిశ్రమలు, భవన నిర్మాణరంగాల్లో, ఇటుక బట్టీలు, హోటళ్లు వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఇలా ఈ జూలై 1 నుంచి 31వరకు తనిఖీలు నిర్వహించి 75మంది చిన్నారులను గుర్తించి బాధ్యులైన ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. 35మందికి నోటీసులు పంపారు.
పేదరికం, నిరక్షరాస్యతతో కొందరు తమ పిల్లలను బడులకు పంపించకుండా బాల కార్మికులుగా మారుస్తున్నారు. దీనికి వారి ఆర్థ్ధిక, సామాజిక పరిస్థితులు కారణం కావచ్చు. దీంతో పాటు కరోనాతో బడుల మూసివేత, పనిలో కార్మికుల కొరత, జిల్లాలో వ్యవసాయ సాగు పెరగడం ఇలా అనేక కారణాలు దీనికి కారణం అవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-3 నుంచి ప్రారంభమై ప్రస్తుతం ముస్కాన్-7 దశ ముగిసింది. 2019లో ఆపరేషన్ ముస్కాన్-5 ద్వారా 35మంచి చిన్నారులకు విముక్తి కలిగించగా 2020 6వ దశను కరోనా కారణంగా నిర్వహించలేకపోయినా ఈ ఏడాది ఆపరేషన్ ముస్కాన్7 ద్వారా అధికారులు 75మంది చిన్నారులను పని నుంచి విముక్తి కల్పించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 390మందిని రక్షించగా వారిలో 334మంది బాలురు 56 మంది బాలికలు ఉన్నారు.
18 ఏండ్ల లోపు బాల బాలికలను పనిలో పెట్టుకోవడం నేరం. ఎవరైనా ఇటువంటి వారిని పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. కఠినంగా శిక్షించడం జరుగుతుంది. బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడంలో అందరూ కలిసి రావాలి. బాల కార్మిక వ్యవస్థ, మానవ ఆక్రమ రవాణాను తీవ్ర నేరాలుగా పరిగణిస్తాం. ఇలాంటి వాటిపై గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. ఆపరేషన్ ముస్కాన్ సమయంలో కాదు సాధారణ సమయంలో కూడా మా దృష్టికి ఇలాంటి సమస్యలు తీసుకొని వస్తే కేసులు నమోదు చేస్తాం
చిన్నారులను పనిలో పెట్టుకోవద్దు. ఎవరైనా బడిఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని దాడులు చేస్తాం. బాధ్యులపై జరిమానాతో పాటు జైలుశిక్ష పడేలా చేస్తాము. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-7 పూర్తి చేశారు. 75మంది చిన్నారులను గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించాం.
-నర్సింహారావు,డీడబ్ల్యూఓ, సూర్యాపేట