సూర్యాపేట, ఆగస్టు 14 : ఈ ఏడాది చెరువుల కింద సాగుకు డోకాలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులల్లో నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వర్షాలతోపాటు కాళేశ్వరం జలాలు, మూసీ నీటితో సుమారు 250 చెరువులు అలుగులు పోశాయి. సూర్యాపేట జిల్లాలో చిన్న, పెద్ద చెరువులు కలిపి 1,315 ఉండగా దాదాపు 50 శాతానికి పైగా నిండిన చెరువుల సంఖ్య వెయ్యి కి పైగానే ఉన్నా యి. మిషన్ కాకతీయ ద్వారా 900 చెరువులకు పైగా పూడిక తీయడంతో చెరువుల నీటి సామర్థ్యం సుమారు 13.38 టీఎంసీలకు చేరుకుంది. ఈ చెరువులు సుమారు 81 వేల ఆయకట్టుకు నీరు అందించనున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో 672, సూర్యాపేట 296, కోదాడ 194, హుజూర్నగర్ నియోజకవర్గంలో153 చెరువులు ఉన్నాయి. కురిసిన వర్షాలతోపాటు కాళేశ్వరం జలాలు, మూసీ నీటితో కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి.
కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువులకు సూర్యాపేట జిల్లా పెట్టింది పేరు.. సమైక్య రాష్ట్రంలో వాటిని నిర్వీర్యం చేయగా స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయతో సుందరీకరించారు. దీంతో చెరువుల కింద ఆయకట్టు భారీగా పెరిగింది. జిల్లాలోని 1,315 చెరువులకు నాలుగు దశల్లో 900 చెరువులను రూ. 355 కోట్లతో పూడిక తీసి నీటి సామర్థ్యాన్ని పెంచారు. దీంతో జిల్లాలో చెరువుల నీటి సామర్థ్యం 13.38 టీఎంసీలకు చేరింది. ఈ నీటితో సుమారు 81 వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా 435 చెరువుల్లో 75 నుంచి 100 శాతం మేర నీటి నిల్వలు ఉండగా 387 చెరువుల్లో 50-75 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. 273 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నీరు ఉండగా కేవలం 71 చెరువుల్లో 25 శాతం నీళ్లు ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా 100 ఎకరాలకు పైగా ఉన్న చెరువులు 188 ఉండగా 100 ఎకరాల లోపు ఉన్న చెరువులు 1,127 ఉన్నాయి. వీటిలో 556 చెరువులు కేవలం కాళేశ్వరం గోదావరి నీటితో నిండనున్నాయి. ఈ చెరువుల్లో సుమారు 6.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీనికి తోడు సాగర్ ఎడమ కాల్వ నీరు విడుదల చేయడంతో ఆ ప్రాంతంలోని మొత్తం చెరువులు నిండుతున్నాయి.
సూర్యాపేట జిల్లా చెరువుల పరిధిలో సు మారు 81 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 100 ఎకరాలకు పైబడిన చెరువులు 188 ఉండగా ఈ చెరువుల కింద సుమారు 43, 500 ఎకరాల ఆయకట్టు ఉంది. 100 ఎకరాలకు లోపు విస్తీర్ణం ఉన్న చెరువులు 1,127 ఉండగా వాటి కింద 37,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. సాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టు తరువాత అత్యధికంగా ఆయకట్టు ఉన్నది ఈ చెరువుల కిందే.అత్యధికంగా రైతులు వరితోపాటు ఇతర పంటలను సా గు చేస్తుంటారు. గత యాసంగి చెరువుల కింద 55 వేల ఎకరాలు సాగు చేశారు. ఈ సారి పూర్తి స్థాయి లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా.