కనుచూపు మేర పచ్చదనం నిండిన పల్లె ప్రకృతి వనం, ఊరు సమీపంలో వైకుంఠ ధామం, వీధుల్లో సీసీ రోడ్లు.. వెరసి మేడారం గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి. పంచాయతీ పాలకవర్గం మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నది. ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేస్తున్న పల్లె ప్రగతి నిధులతో మేడారం గ్రామానికి కొత్త శోభ చేకూరింది.
మండలంలోని మేడారం గ్రామం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామంలోని ఏ రహదారి చూసినా గుంతల మయంగా కనిపించేది. ఏదైనా పని మీద మండల కేంద్రానికి రావాలంటే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గత పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా జరుగని అభివృద్ధి మూడేండ్లలో కనిపిస్తున్నదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో 10వార్డులు, 1,850 మంది జనాభా ఉండగా.. ఆ మేరకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాన్ని తీర్చిదిద్దారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించడంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని రెండు మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా 456ఇండ్లకు మంచినీరు సరఫరా అవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి సకాలంలో నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నేపథ్యంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎవరైనా మరణిస్తే గ్రామ సమీపంలోని ఎడమ కాల్వ కట్టపై దహన సంస్కారాలు నిర్వహించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. రూ.12.50లక్షలతో గ్రామ సమీపంలో వైకుంఠ ధామం నిర్మించారు. రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు పనులను పూర్తి చేశారు. ఎస్ఎఫ్సీ నుంచి రూ.14లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.94లక్షలు, డీఎంఎఫ్టీ నుంచి రూ.40లక్షలు, ఈజీఎస్ నుంచి రూ.5లక్షలు, ఎస్ఎఫ్సీ నుంచి రూ.10లక్షలు మంజూరు కాగా, అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను అందించడంతో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీ సిబ్బంది కృషి చేస్తున్నారు. గ్రామంలో నిత్యం చెత్త సేకరించి కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
గ్రామంలో పచ్చదనం కోసం ఎకరం విస్తీర్ణంలో రూ.6లక్షలు వెచ్చించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 4వేలకు పైగా పలు రకాల మొక్కలతో వనాన్ని తీర్చిదిద్దారు. పట్టణాల్లో పార్కులకు దీటుగా ఏర్పాటు చేశారు. మరోవైపు హరితహారంలో భాగంగా 8వేల మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ 6మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు.
గతంలో
మండల కేంద్రానికి దూరంగా ఉన్న మా గ్రామాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ సరిగా పట్టించుకోలేదు. గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీలు, వీధిలైట్లు కూడా సక్రమంగా లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో మా గ్రామం లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నిధులు మంజూరు చేయడంతో రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజల సహకారంతో పల్లె ప్రగతి పనులు పూర్తి చేశాం. అధికారులు, గ్రామ పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుండడంతో పనులు సకాలంలో పూర్తయ్యాయి. గ్రామస్తులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింతగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.