చెరువుల నిండా జలం
మునుగోడు, సెప్టెంబర్ 12 : పల్లెలకు ప్రాణాధారమైన చెరువులు ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఒకప్పుడు చుక్కనీరు నిల్వ ఉండని తటాకాలు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పుణ్యమే అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
20 చెరువుల పునరుద్ధరణ…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోయాయి. రాష్ట్రం ఏర్పాటుతోనే చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ సర్కారు 2015లో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని చేపట్టింది. దాంతో మునుగోడు మండలంలోని 20 ప్రధాన చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఆయా చెరువుల్లో తుమ్మచెట్లు, పూడికను తొలగించి కట్టలను బలోపేతం చేశారు. అలుగు, తూములు, కాల్వలకు మరమ్మతులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులకు ఏడాది పొడవునా సాగునీరు లభించనుంది. దీనికితోడు గ్రామాల్లో భూగర్భజలాల నీటి మట్టం పైపైకి చేరింది.
రూ.14కోట్లతో…
మండలంలోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ.14కోట్లు ఖర్చు చేసింది. మునుగోడు చెరువుకు రూ.1.31కోట్లు, చల్మెడ రూ.55.37లక్షలు, చీకటిమామిడి రూ.1.15కోట్లు, చొల్లేడు రూ.95.33లక్షలు, గూడపూర్ రూ.82.56లక్షలు, కచలాపురం రూ.41.88లక్షలు, కల్వకుంట్ల రూ.72.38లక్షలు, కల్వలపల్లి రూ.73.88, కిష్టాపురం రూ.1.96కోట్లు, కొరటికల్ రూ.72.08లక్షలు, పలివెల రూ.1.28 కోట్లు, పులిపలుపుల రూ.58.84లక్షలు, సింగారం రూ.13.64లక్షలు, ఇప్పర్తి రూ.22.9లక్షలు, జమస్థాన్పల్లి రూ.24.8లక్షలు, కొంపల్లి రూ.63.96లక్షలు, కోతులారం రూ.41.17లక్షలు, వెల్మకన్నె రూ.74.71లక్షలు, ఊకొండి రూ.33.35లక్షలు, గంగోరిగూడెం రూ.17.4లక్షల చొప్పున ఖర్చయింది.
సాగునీటికి ఢోకా లేదు
మా గ్రామంలోని చెరువు గతంలో పూడిపోయింది. వర్షాలొచ్చినా నీరు నిలబడకపోయేది. మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేసిన తర్వాత నీటి నిల్వ పెరిగింది. చెరువులో ఏడాదంతా నీరు ఉండటం వల్ల సాగునీటికి ఢోకా లేదు. బోర్లు మంచిగ పోస్తున్నయి. ఊరిలో రైతులు పత్తి, వరి, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలను సాగుచేసుకుంటున్నరు.
చెరువులు నిండినయి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అన్ని చెరువులు పూర్తిగా నిండాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. రైతులకు సరిపడా సాగునీరు లభిస్తున్నది. చెరువులు నిండుగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నాం.