వ్యవసాయ అనుబంధ వృత్తుల బలోపేతం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వృత్తిదారుల ఆర్ధిక పరిపుష్టే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆత్మకూరు.ఎస్ మండలంలోని నెమ్మికల్ చెరువులో బుధవారం చేప పిల్లలను
వదిలి సూర్యాపేట జిల్లాలో ఆరో విడుత పంపిణీని మంత్రి ప్రారంభించారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలకు రూపకల్పన చేశారని, అందులో భాగంగానే ప్రభుత్వం నీలి విప్లవం ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చేప పిల్లల పంపిణీ మొదలుకుని వాహనాలు, సామగ్రి అందిస్తుండడంతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో 6వ విడుత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఉదయం ఆత్మకూర్ ఎస్ మండలంలోని నెమ్మికల్ గ్రామంలో ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులను బలోపేతం చేయడం ద్వారా వృత్తిదారుల కుటుంబాల్లో వెలుగులు సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారన్నారు. ఏడేండ్లలో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలతో రాష్ర్టాన్ని జల భాండాగారం చేశారని, ఉమ్మడి పాలనలో ముళ్ల కంపలతో నిండిన చెరువులు, కుంటలు, వట్టిపోయిన వాగులు నేడు కృష్ణా, గోదావరి జలాలతో పొంగిపొర్లుతున్నాయని అన్నారు.
తెలంగాణ మహోపాధ్యాయుడు కాళోజీ : మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట అర్బన్, సెప్టెంబర్ 9 : ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవితం దేశానికే ఆదర్శమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ జయంతి, గురుపూజోత్సవాల్లో ఆయన చిత్ర పటానికి మంత్రి పూలమాల వేసి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళోజీ ఏ సందర్భంలోనూ పదవులకు, డబ్బుకు దాసోహం కాలేదని అంతటి మహోన్నత వ్యక్తి జయంతిని రాష్ట్ర భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది ఆదర్శంగా నిలువాలని కోరారు. ఆయా కార్యమ్రాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, ఆత్మకూర్ ఎంపీపీ మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, డీఈఓ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, తూడి నర్సింహారావు, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
విఘ్నాలను అధిగమించండి
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : ఎటువంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతుందని, అదే పరిపాలన యావత్ భారత దేశానికి రోల్ మోడల్ అవుతుందని పేర్కొన్నారు.