ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 12వేల విగ్రహాలు! n అనుమతి కోసం ఉత్సవ కమిటీల దరఖాస్తు
సూర్యాపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గణేశ్ నవరాత్రోత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10న వినాయక చవితి ఉండగా ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. గతేడాది కొవిడ్ కారణంగా అతి తక్కువ సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేయగా ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12వేల వరకు విగ్రహాలను ప్రతిష్ఠించే అవకాశం కనిపిస్తున్నది. నల్లగొండ జిల్లాలో 5 నుంచి 6వేలు, సూర్యాపేట జిల్లాలో 3 నుంచి 4 వేలు, యాదాద్రి జిల్లాలో 2 నుంచి 3వేల విగ్రహాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా వందలాది దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతుండగా ఈసారి మట్టి విగ్రహాలకే అధికంగా భక్తులు ప్రాధాన్యమిస్తున్నారు.
కోలాహలం షురూ…
మరో మూడ్రోజుల్లో జరుగనున్న వినాయక చవితి వేడుకల కోసం ఆయా పట్టణాలు, గ్రామాల్లో కోలాహలం షురూ అయ్యింది. మండపాల ఏర్పాటు కోసం ఉత్సవ కమిటీలు ఓ పక్క చందాల రూపంలో నిధులు సమీకరిస్తూ స్థలాలను ఎంపిక చేసుకుంటూ సరుకు సరంజామలను సిద్ధం చేసుకుంటున్నారు. విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాల వద్ద విగ్రహాల కొనుగోళ్ల కోసం భక్తులు పరుగులు తీస్తున్నారు.
మట్టి విగ్రహాలకు క్రేజ్…
పీఓపీతో తయారు చేసి కలర్లు వేసిన విగ్రహాలతో కాలుష్యం పెరిగి పర్యావరణం పెరుగుతుండడంతో గత కొద్ది సంవత్సరాలుగా మట్టి విగ్రహాలకు క్రేజ్ పెరుగుతున్నది. తొలుత సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మట్టి విగ్రహాల ఉద్యమం షురూ కాగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో కలెక్టర్ నిధులతో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం ప్రజల్లో కూడా భారీగా మార్పులు వస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాల ఏర్పాటు జరుగుతుంది. ఈసారి కూడా మట్టి విగ్రహాలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
అనుమతి తీసుకోవాలి
వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వారు విధిగా పోలీస్ అనుమతి తీసుకోవాలి. కొవిడ్ నిబంధనలూ పాటించాలి. ఉత్సవ కమిటీలు ముం దుగా ఆన్లైన్ ద్వారా విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు 102 దరఖాస్తులు అందాయి. మండపాల వద్ద నిబంధనలు పాటిస్తూ నవరాత్రోత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.
మట్టి గణపయ్య ఎందుకంటే..!
చండూరు/నేరేడుచర్ల, సెప్టెంబర్ 7 : సోదరభావం, సమష్టి తత్వాన్ని పెంపొందించే గణేశ్ నవరాత్రోత్సవాల్లో పీఓపీ విగ్రహాల వినియోగం పలు అపశ్రుతులకు కారణమవుతున్నది. ఆకర్షణీయమైన, అతిపెద్ద ప్రతిమల తయారీ కోసం మితిమీరి ఉపయోగిస్తున్న రసాయనాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకల్లో మట్టి ఆకృతులకు జై కొట్టాల్సిన తరుణమిదే.
ఇదీ రసాయనాల సెగ…
ప్రతిమల తయారీలో ఉపయోగించే కాల్షియం సల్ఫేట్(జిప్సం) నీటిలో కరగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఆ నీటి వాడకంతో పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. ధైరాయిడ్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
మెగ్నీషియం నరాల వ్యవస్ధను దెబ్బతీస్తుంది…
లెడ్, కాడ్మియం తీరని హాని చేస్తాయి. రక్తంలో మార్పులొస్తాయి. గుండె సమస్యలు ఎదురవుతాయి.
ఆర్గానిక్‌తో ఎముకల సమస్య, మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది.
కోబాల్డ్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్ మిశ్రమాలతో కాలేయం, మూత్రపిండాలకు ముప్పు వాటిల్లుతుంది.
శ్వాస, చర్మ జబ్బులు సోకేందుకు ఆస్కారముంది.
నిబంధనలు ఇవీ..
వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునే వారు ముందుగా కమిటీ వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలి.
అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేయకూడదు.
విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పోలీసుల అనుమతి పొందడానికి ఆన్లైన్లో httpః//policeportal.tspolice.gov.in/index.htmలో లాగిన్ కావాలి.
మండపాల వద్దకు వచ్చే భక్తుల వాహనాలకు విధిగా పార్కింగ్ ఉండేలా చూడాలి.
మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడడం వంటివి చేయరాదు.
n విగ్రహాల సంరక్షణకు మండపాల వద్ద 24గంటలూ ముగ్గురికి తగ్గకుండా వలంటరీలు ఉండాలి. వారి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలపాలి.
అప్పుడప్పుడూ పోలీసులు వచ్చి మండపాల వద్ద వలంటరీలను తనిఖీ చేస్తుంటారు.
పెద్ద మండపాల వద్ద కమిటీ వారు క్యూ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
మండపాలు కూలిపోకుండా క్వాలిటీ మెటీరియల్‌తో నిర్మించాలి.
అగ్నిమాపక, విద్యుత్ శాఖ అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జాయింట్లు లేని విద్యుత్ వైర్లే మండపాలకు వాడాలి.
మండపాల వద్ద మండే స్వభావం ఉన్న పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పేలేడు పదార్థాలు లేకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉత్సవాలు జరిగినన్ని రోజులూ బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం నిషేధం.
సాంస్కృతిక కార్యక్రమాల కోసం డీఎస్పీ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి.
బలవంతంగా చందాలు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
రోడ్లకు అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించవద్దు.