రైల్వే మీటింగ్‌లో ఎంపీ బడుగుల
బీబీనగర్ నుంచి నడికుడి రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను పార్లమెంట్ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ముందుంచారు. భువనగిరి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. భువనగిరి, ఆలేరు రైల్వే స్టేషన్లలో శాతవాహన, పద్మావతి, చార్మినార్, కాకతీయ, ఫలక్‌నుమా, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లకు స్టేజీ ఏర్పాటు చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సూర్యాపేట, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన ప్రాజెక్టులపై రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ హైదరబాద్ – విజయవాడ వరకు జాతీయ రహదారి 65వెంట బుల్లెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టాలని, బీబీనగర్ – నడికుడి మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చాలని కోరారు. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి కానున్నందున రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. విష్ణుపురం జాన్‌పహాడ్, మేళ్ల చెర్వు, మఠంపల్లి, జగ్గయ్యపేట మీదుగా విజయవాడ వరకు ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. డోర్నకల్ జంక్షన్ నుంచి సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్ మీదుగా గద్వాల వరకు నూతన రైలుమార్గం ఏర్పాటుకు సర్వే పనులు చేపట్టాలని, నల్లగొండ, మిర్యాలగూడెం, భువనగిరి రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు, తాగునీరు సహా మౌలిక వసతులపై దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంత ప్రయాణికులకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు ఒక బోగీ ప్రత్యేకంగా కేటాయించాలని, సికింద్రాబాద్- విజయవాడ సూపర్ ఫాస్ట్ రైలు నల్లగొండ, మిర్యాలగూడలో నిలిచేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. సికింద్రాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు భువనగిరిలో స్టేజీ ఏర్పాటు చేయాలని, భువనగిరి, ఆలేరులో శాతవాహన, పద్మావతి, చార్మినార్, కాకతీయ, ఫలక్‌నుమా, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యేకంగా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని కోరారు. బాహుపేట వద్ద అండర్‌పాస్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అండర్ పాస్లరే ప్రత్యామ్నాయంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.