పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపడుతున్నారు.2015 నుంచి ఏడేండ్లలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనం పంచుతున్నాయి. హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు తాజాగా సీఎం కేసీఆర్ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేజీ నుంచి పీజీ విద్యార్థులు.. ఐఏఎస్ నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు భాగస్వామ్యం ఉండేలా సంకల్పించారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హరిత కాంతులు నిండనున్నాయి.
హరితహారంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనం అల్లుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రకటించిన హరితనిధితో హరితవనాలు మరింత పెరుగనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కోట్లాది మొక్కలు నాటడంతో ఖాళీ స్థలాలు చిట్టడవులను తలపిస్తున్నాయి.రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ఎడారిలా మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2015 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హరితహారంతో నేడు పచ్చదనం తొణికిసలాడుతున్నది. నాడు దాదాపు 70శాతం భూములు నీరందక బీళ్లుగా మారాయి. కానీ, నేడు ఇంచు భూమి ఖాళీ లేకుండా సాగు చేసుకునేలా నీరందించడంతో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. మరో పక్క హరితహారం ద్వారా జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, పట్టణాలు, పల్లెల్లో కోట్లాది మొక్కలు నాటించారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఎకరం భూమికి తగ్గకుండా మొక్కలు నాటడంతో అవి అడవులను తలపిస్తున్నాయి. ఏ రహదారి వెంట వెళ్లినా సేదతీరాలనిపించే రీతిన మొక్కలు పెరుగుతున్నాయి. హరితహారం కార్యక్రమాల ద్వారా సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల మొక్కలు నాటగా నల్లగొండ జిల్లాలో సుమారు 7కోట్లు, యాదాద్రి జిల్లాలో దాదాపు 3 కోట్లు మొత్తం 15 కోట్ల మొక్కలు నాటారు. వీటిలో సుమారు 70శాతం మొక్కలు పెరుగుతున్నాయి.
పచ్చదనంలో అత్యుత్తమ ఫలితాలు ఖాయం..
హరితహారం కార్యక్రమంతో పచ్చదనం పెరుగడంతోపాటు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. వేసవిలో గతంతో పోల్చితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన హరితనిధితో విరివిగా డబ్బులు సమకూరి హరితహారం ఉవ్వెత్తున కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాలు ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేసి వేసవిలో మొక్కలకు నీళ్లు పోస్తుండగా.. నిధుల కొరత తీరనుండడంతో మొక్కల సంరక్షణకు ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
హరిత నిధితో పెరుగనున్న బాధ్యత..
సాధారణంగా ఎవరికైనా విరాళాల రూపేనా డబ్బులు ఇస్తే ఆ నిధుల వినియోగం, ఫలితాలు ఎంతో తృప్తినిస్తాయి. అదే రీతిన హరిత నిధికి నర్సరీ విద్యార్థులు మొదలుకొని అధికారులు ఐపీఎస్, ఐఏఎస్లు, ప్రజాప్రతినిధులు సైతం నిధులు ఇవ్వనున్నారు. సమకూరిన నిధులతో మొక్కల సంరక్షణ సులువుకానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగనున్న భాగస్వామ్యం..
హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెరుగనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వమే నిధులను సమకూర్చి విజయవంతం చేసింది. ఇక మీదట అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సహా అందరూ నిధులను సమకూర్చడంతో పాటు వాటిని హరితహారానికి వెచ్చించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం అలోచిండడం అభినందనీయం.
మెరుగైన ఆలోచనతో విస్తృతం కానున్న హరితహారం
హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతగా నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా మెరుగైన ఆలోచనతో ముందుకు పోతున్నది. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు అందించే నిధులతో హరితహారం మరింత విస్తృతం కానున్నది. హరితహారం నిధుల సేకరణ కోసం ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం హర్షించదగిన విషయం.
ఆహ్లాద భరితం
మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మిర్యాలగూడ మండలంలోని అన్ని పంచాయతీల్లో అడుగడుగునా హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్తున్నా రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. గతంలో వనాలు లేక వలస పోయిన పక్షులు, పిచ్చుకలు, ఉడుతలు తిరిగి వచ్చి సంతతిని అభివృద్ధి చేసుకుంటున్నాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్తందాన్ని తెస్తున్నాయి.
హరిత దారులు
మాడ్గులపల్లి, అక్టోబర్ 3 : మండలంలోని ఇందుగుల-సర్వారం రహదారిలో దారికి ఇరువైపులా నాటిన మొక్కలు పెనవేసుకున్నట్లుగా మారాయి. అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై 13కిలోమీటర్ల పొడవున రోడ్డుకు ఇరువైపులా నాటిన 5,200 మొక్కలు ఏపుగా పెరిగాయి.
పల్లె బాట పచ్చ తోరణం
ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 3 : హరితహారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పల్లెర్ల-సిద్ధాపురం రోడ్డుకు ఇరువైపులా 600 మొక్కలు, కూరెళ్ల- పల్లెర్ల గ్రామాల మధ్యన 100, పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రధాన వీధి వెంట 150,
పుల్లాయిగూడెం-కూరెళ్ల రోడ్డుకు ఇరువైపులా 450 మొక్కలు కనువిందు చేస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.