ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
అంబరాన్నంటేలా గులాబీ రెపరెపలు
సంస్థాగత సంబురం షురూ..
ఉత్సాహంగా పాల్గొన్న శ్రేణులు
ర్యాలీలు, జెండావిష్కరణలు, నినాదాలు
ఢిల్లీలో అధినేత కేసీఆర్‌తో కలిసి
మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా నేతల సందడి
నల్లగొండలో జెండా ఎగురవేసిన
మండలి మాజీ చైర్మన్ గుత్తా
నేటి నుంచి కమిటీల ఏర్పాటు
ఊరూవాడ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. జిల్లా కేంద్రాల నుంచి మారుమూల పల్లెల వరకూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఓ వైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన, మరోవైపు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టే శుభ సందర్భాన..టీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునందుకుని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఉత్సాహంగా కదం తొక్కాయి. చౌరస్తాలు, జెండా దిమ్మెలను అలంకరించి ఎక్కడికక్కడ టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశాయి. ర్యాలీలు తీశాయి. నల్లగొండలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జెండాను
ఆవిష్కరించారు. శుక్రవారం నుంచి మొదలుకానున్న సంస్థాగత నిర్మాణానికి జెండా పండుగతో
పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలు సందడి చేశారు. తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో వాడవాడలా టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల ర్యాలీలు తీశారు. అమరవీరులకు జోహార్లు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుండడంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నెల 20లోపు గ్రామ/వార్డు, పట్టణ/మండల కమిటీ ఎన్నికలు పూర్తి చేసి జిల్లా కమిటీల నిర్మాణాన్ని చేపట్టనుండడంతో పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీ భూమి పూజ కార్యక్రమంలో…
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. మంత్రి
జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీ
బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు చాడ కిషన్‌రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరి కాయలు కొట్టారు.
టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం శుభ పరిణామం
జెండా పండుగలో గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 2 : ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే మనుగడ సాధిస్తుందని, ఈ సారి టీఆర్ఎస్ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడానికి చేపడుతున్న కార్యక్రమం శుభ పరిణామమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని 48వ వార్డులో స్థానిక కౌన్సిలర్ యామ కవితాదయాకర్తో కలిసి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీకీ లేనంత టీఆర్ఎస్లో క్రియాశీలక, శాశ్వత సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ఉన్నారన్నారు. ఇంత పెద్ద సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితోనే ఎక్కువ మంది ఈ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యామ దయాకర్, కొండూరు సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి, అనీస్, మైనం శ్రీనివాస్, నేతి రఘుపతి పాల్గొన్నారు.