రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పాలనలో చేతినిండా పనితో రందిలేకుండా బతికిన నేతన్నలను జీవితాలను ఆగం చేసిన, కడుపుమీద కొట్టిన కాంగ్రెస్‌కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ఆర్డర్లు కావాలని అడిగిన ఆసాములు, సేట్లను అవమానించునోళ్లను, బెదిరించినోళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్లలోని 7వ వార్డులో ప్రచారం చేసి, ప్రసగించారు. తనను ఐదు సార్లు గెలిపించిన సిరిసిల్లను బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పదేండ్లలో రూ.1531 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..? చెప్పాలన్నారు. “కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇచ్చిండ్రా..? అత్తకు రూ.4వేలు, కోడలుకు రూ.2500 వచ్చినయా..? రూ.2వేల పింఛన్ రూ.4 వేలు చేస్తాన్నరు.. వచ్చినయా..? స్కూటీలు ఇచ్చిండ్రా..? విద్యార్థులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డు ఇచ్చిండ్రా..? ఉద్యోగాలు ఇచ్చిండ్రా..?” అని ప్రశ్నించారు. “బతుకమ్మ చీరలు వచ్చినయా..? కేసీఆర్ కిట్లు ఇచ్చిర్రా..?” అని మహిళలను అడగడంతో రాలేవంటూ బదులిచ్చారు.
ఇవన్నీ ఇస్తమని చెప్పి, మోసం చేసోటోళ్లకు ఓట్లెద్దామా..? అని అడిగారు. మన అభ్యర్థులను గెలిపించుకుంటే.. నాకు బలం ఇచ్చినోళ్లు అయితరని, హామీల అమలు కోసం అవతల రేవంత్‌రెడ్డిని గళ్లాపట్టి అడగొచ్చని, మనకు చేస్తా అన్న పనులు ఎందుకు చేయలేదని నిలదీస్తామని చెప్పారు. మళ్లీ ఆయనకే ఓటు వేస్తే వారికి బలమిచ్చినట్లవుతుందని, ఒక్క పనీ కాదని వివరించారు. అతను మనోడే అని కులపోళ్లు ఓటు వేస్తే మోసం అయితదని, ఇక్కడోళ్లు మనోళ్లే కావచ్చుగానీ, వాళ్లకు వేసే ఓట్లు అక్కడోళ్లకు పోతాయని అప్రమత్తం చేశారు. సిరిసిల్ల బాగోగులు చూసిన, మంచి చేసిన, అభివృద్ధి చేసిన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఆగం కావద్దని సూచించారు.
కాంగ్రెసోళ్లు వచ్చి రూ.వెయ్యి, రూ.2 వేలు ఇస్తే తీసుకోండని, మిగిలిన రూ.99 వేలు ఎప్పుడు ఇస్తావని నిలదీసి అడగాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలకు ఓటుతో బుద్ధిచెప్పాలని, సిరిసిల్లకు బతుకునిచ్చిన కేసీఆర్‌ను మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.