దళిత బంధుపై ఎస్సీ కాలనీల్లో కొత్త ఆశలు
తిరుమలగిరి మండలంలో నేటికీ గుడిసెల్లోనే 1,500కిపైగా
కుటుంబాలు పట్టించుకునేవారు లేక దశాబ్దాలుగా వెనుకబాటు
నేడు ఎవరిని కదిలించినా చెప్పలేనంత సంతోషం
తొండ, శాలిగౌరారంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
తిరుమలగిరి, సెప్టెంబర్ 2 : పట్టించుకునే పాలకుడు లేక దశాబ్దాల తరబడి ఆర్థిక, సామాజిక వెనుకబాటుకు గురవుతూ వస్తున్న అణగారిన వర్గాలకు ఇన్నేండ్లకో అండ లభించింది. దళిత బంధు పథకం అమలుకు తిరుమలగిరి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఇక్కడి కడుబీద దళితులకో దారి దొరికింది. రెక్కలే ఆస్తిగా కూలీనాలి, దొరికిన పనులతో జీవితాలను నెట్టుకొస్తున్న వారిలో భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దళిత బంధు ద్వారా సర్కారు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని తమ బతుకులను బాగు చేసుకుంటామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులెత్తి మొక్కతున్నారు. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి. దళితులు స్థితిగతులను మార్చే మహత్తర పథకానికి స్వాగతం పలుకుతూ.. గురువారం తొండ, శాలిగౌరారంలో దళితులు, దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం కొత్త ఎస్సీ కాలనీలో 50 దళిత జంగాల కుటుంబాలు ఉన్నాయి. వీరు 10ఏండ్ల క్రితం కుటుంబానికి రూ.20 వేల చొప్పున డబ్బులు వేసుకొని రూ.10 లక్షలతో ఎకరం స్థలం కొనుగోలు చేసి గుడిసెలు వేసుకున్నారు. అదేవిధంగా తాసీల్దార్ కార్యాలయం సమీపంలో మరో కాలనీవాసులు సైతం ఇదేవిధంగా వంద గజాల చొప్పున ఇంటి స్థలాలు కొనుగోలు చేసి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు వారికి సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు అవి. ప్రస్తుతం వారికి దళితబంధు వర్తింపుతో ఆ కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరిని ఎంపిక చేసి రూ.250 కోట్లు కేటాయించటంతో వారు సంబురపడుతున్నారు. తమకు వచ్చే రూ.10 లక్షలతో ఆటోలు, ట్రాలీలు కొనుక్కుంటామని, చిరువ్యాపారాలు చేసుకుంటామని వారు పేర్కొంటున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామని చెబుతున్నారు. తిరుమలగిరి మండలంలో 2,500 దళిత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 80 శాతానికి పైగా నిరుపేదలు, కూలీలుగా ఉన్నారు. తిరుమలగిరి, అనంతారం, మాలిపురం, నందాపురం, మామిడాల, జలాల్పురంలోని ఎస్సీ కాలనీల్లో సుమారు 15 వందల కుటుంబాలు కడు బీదరికంలో ఉన్నాయి. వీరిలో చాలామంది రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మండలంలో 500పైగా కుటుంబాల వారిని జంగాలుగా పిలుస్తుంటారు. వీరందరూ గుడిసెల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తెల్లవారగానే నిద్ర లేచింది మొదలు కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, పాత సామగ్రిని ఏరుకొని అమ్ముకోగా వచ్చిన ఆదాయంతో జీవిస్తున్నారు. ఇలాంటి వారి జీవితాల్లో దళితబంధు వెలుగులు నింపనున్నది. 500 కుటుంబాలు మాత్రమే తమకు ఉన్న ఎకరం, రెండెకరాల భూమిని సేద్యం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులందరికీ రూ.10 లక్షలు ప్రకటించడంతో వీరి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. దళితబంధును వీరంతా అదృష్టంగా, గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు తెచ్చాడనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అభినవ అంబేద్కర్గా తమకు దళితబంధు పథం అమలు చేస్తున్నారని వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. వారి కళ్లల్లో ఆనందం ఉజ్వల భవిష్యత్‌కు నాంది కానుందని సీఎం కేసీఆర్‌కు పెద్ద మనసుతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. మున్సిపాలిటీలో 4,032 మంది, మండలంలో 3,624 మంది దళితులు ఉన్నారు. తాటిపాములలో అత్యధికంగా 1,186 మంది ఎస్సీలు ఉండగా, బండ్లపల్లిలో కేవలం 70 మంది మాత్రమే ఉన్నారు. వీరి బతుకులకు దళితబంధు భరోసాతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి దిక్సూచిగా నిలిచారనే భావన దళితుల్లో వ్యక్తమవుతున్నది.