బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 4 : నాటేందుకు సిద్ధంగా ఉన్న మొక్కలను దుండగులు ధ్వంసం చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 4వ వార్డు లే అవుట్ భూమిలో మున్సిపాలిటీకి ఇచ్చిన ఆరు గుంటల స్థలంలో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పా టు చేసేందుకు సిద్ధంగా ఉంచిన మొక్కలను, ఫెన్సింగ్‌ను దుండగులు ధ్వంసం చేశారు. మొక్కల పరిశీలన అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారానికి తూట్లు పొడవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అడ్డంకులు సృష్టిస్తే ఎంతటి వారైన సహించేది లేదన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి మకట్‌లాల్, అధికారులు పాల్గొన్నారు.
దురాజ్‌పల్లి శివారులో హరితహారం మొక్కలు ధ్వంసం
చివ్వెంల,సెప్టెంబర్4 : మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి శివారులో గత సంవత్సరం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెతో పాటు చెట్లను సైతం ధ్వంసం చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.