విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన షురూ..
విద్యాసంస్థల్లో సందడి
మాస్కులు ధరించి వచ్చిన విద్యార్థులు
ఇంటర్ కళాశాలల్లో తొలి అడుగులు వేసిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో 30శాతం విద్యార్థుల హాజరు
రామగిరి, సెప్టెంబర్ 1 : సుదీర్ఘ కాలం తర్వాత విద్యార్థులు సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. కరోనాతో సుమారు 5నెలల తర్వాత బుధవారం పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులతో భౌతికంగా పునః ప్రారంభమవడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఇన్ని రోజులు కాస్త సరదాగా గడిపిన విద్యార్థులు కొత్త వాతావరణంలో అడుగులు వేశారు. పదోవ తరగతి పూర్తి చేసుకుని మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటర్లోకి అడుగు పెట్టారు. కళాశాలలోని తరగతి గదుల్లో తొలి రోజు కొత్త స్నేహితులతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిచయం చేసుకున్నారు.
బిజిబిజీగా తల్లిదండ్రులు
జిల్లావ్యాప్తంగా బడులు, కళాశాలలు తెరుచుకోవడంతో తమ పిల్లలను తయారు చేసి లంచ్‌బాక్సు రెడీ చేయడం వారిని ఆటో, సైకిళ్లు, బైకులపై తీసుకెళ్లి పాఠశాల దగ్గర దింపడం తదితర పనులతో తల్లిదండ్రులు తొలి రోజు బిజీబిగీగా గడిపారు. అంతటా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలు కూడా మొదటి రోజు కావడంతో సంతోషంగా తరలి వెళ్లారు. ఇక జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది.
పాఠశాలలను తనిఖీ డీఈఓ భిక్షపతి
నల్లగొండలోని రామగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ బి.భిక్షపతి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణతోపాటు తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. భౌతిక దూరం పాటించాలని, శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను వినాలని సూచించారు. పాఠశాల వాతావరణం, తరగతి గదులు శుభ్రంగా ఉండటంతో అభినదించారు. అదే విధంగా డీఈఓ జిల్లాలోని కొప్పోల్ జడ్పీ హైస్కూల్, గుర్రంపోడు, మర్రిగూడ మండల కేంద్రంలోని జడ్పీ స్కూల్, ప్రాథమిక పాఠశాల, మోడల్ స్కూల్, నాంపల్లి మండలంలోని జడ్పీ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే వారికి పలు సూచనలు ఇచ్చారు.
సూర్యాపేట జిల్లాలో 1,278 మంది హాజరు
సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 21.64 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆన్లైన్లో క్లాసులు వినలేదు
కరోనా వల్ల ఇన్ని రోజులు పాఠశాలలు మూతబడ్డాయి. ఆన్లైన్ తరగతులను పూర్తిస్థాయిలో విద్యార్థులు వినియోగించుకోలేదు. తల్లిదండ్రులు దగ్గరుంటేనే పిల్లలు చదువుతున్నారు. ఇకనైనా బడులు తెరిచినందుకు సంతోషంగా ఉంది. మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నా. మొదటి రోజే పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టిర్రు.
-కుర్రి శ్రీనివాస్, మునగాల
ఇంటి దగ్గర ఇబ్బంది పడ్డాం
పాఠశాలలు లేకపోవడంతో ఇంటి దగ్గర ఉండి చదివితే అస్సలు అర్థంకాక ఇబ్బందులు పడేవాళ్లం. స్కూళ్లలో ఉపాధ్యాయులు చెబితేనే పాఠాలు అర్థమవుతాయి. తరగతి గదిలో మాస్కులు ధరించి, భౌతిక దూరంలో కూర్చుంటూ పాఠాలు వింటున్నం. మా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించడం సంతోషంగా ఉంది.
-సిద్దు, విద్యార్థి, ఎండ్లపల్లి, సూర్యాపేట మండలం
ఎంజీయూ విద్యార్థులు హాజరుకావాలి : వీసీ
రామగిరి, సెప్టెంబర్ 1: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫ్రభుత్వ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించామని వైస్‌చాన్స్‌లర్ సీ.హెచ్ గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ప్రత్యేక తరగతులకు తమ కళాశాలలకు వెళ్లి హాజరు కావాలని సూచించారు. యూనివర్సిటీ హాస్టల్స్ విద్యార్థుల కోసం పూర్తిగా కొవిడ్ నిబంధనలతో సిద్ధం చేశామని, విద్యార్థుల వస్తే వాటిలో వసతులు కల్పిస్తామని తెలిపారు. యూనివర్సిటీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, కామర్స్ అండ్ ఎంబీఏ, ఆర్ట్ అండ్ సోషల్ సైన్స్‌తోపాటు యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
బడి మొదలవుతుందని అనుకోలేదు
పోయిన ఏడాది 9వ తరగతిలో ఉన్నప్పుడు ఫిబ్రవరి, మార్చి 23వరకు బడికి వచ్చాను. మార్చి 24న నుంచి కొవిడ్ లాక్డౌన్ రావడంతో బడి బంద్ అయింది. అప్పటి నుంచి మళ్లీ ఆన్లైన్ తరగతులు, టీవీ, దూరదర్శన్ యాదగిరి, టీశాట్‌లో డిజిటల్ పాఠాలు విన్నాం. మళ్లీ బడి ప్రారంభం అవుతుందని అనుకోలేదు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, సీఎం కేసీఆర్‌సార్ ప్రత్యేక్ష తరగతులను మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది.
ధర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతించాం
ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులకు శానిటైజర్ వేసి అనుమతించాం. ఇన్ని రోజులుగా విద్యార్థులేక బోసిపోయిన పాఠశాల తరగతి గదులు విద్యార్థులతో సందడిగా ఉండటంతో చాలా సంతోషంగా ఉంది.
ఇంటర్ కాలేజ్‌లో తొలి అడుగు వేశా
ఇప్పటి వరకు లాక్డౌన్ కొనసాడంతో ఇంటి నుంచే పాఠాలు విన్నాం. ఇంతకాలం పాఠశాలలో ఉన్నాను కాబట్టి తొలి సారి జూనియర్ కళాశాలలో అడుగవేసి తరగతి గదిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.