సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో శ్రీవరవర రంగనాయకస్వామి దేవాలయం పునఃప్రారంభానికి నోచడం లేదు. సుమారు 400ఏండ్ల చరిత్ర కలిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు. 2013 నవంబర్ 8న జీర్ణోద్ధరణ ప్రారంభించగా పనులు వాయిదా పడుతున్నాయి. 2018 జూన్ 18న ముహూర్తంగా నిర్ణయించి 2017 సంవత్సరంలో పనుల్లో వేగం పెంచారు. కానీ పలు కారణాలతో 2020 మే నెలలో ప్రారంభించాలనుకున్నప్పటికీ 2021 మార్చికి వాయిదా వేశారు. తిరిగి వచ్చే ఏడాదైనా ప్రారంభించాలని గ్రామ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.
దేవాలయ పునర్నిర్మాణ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపనకు సీజీఎఫ్(కామన్ గుడ్ ఫండ్) నుంచి రెండు విడుతల్లో కోటి రూపాయలు విడుదలయ్యాయి. దీనికి తోడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరో కోటి రూపాయలు విరాళాలు సేకరించారు. ఇదిలా ఉండగా దేవుడి పేరుతో గణపవరంలో 22 ఎకరాలు, మేళ్లచెర్వు మండలం కందిబండ రెవెన్యూలో 33 ఎకరాల భూమి ఉంది. ఏటా దాదాపుగా రూ.6లక్షల కౌలు ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో 2017 సంవత్సరంలో పనులు వేగవంతం చేశారు. కానీ, మూడు దఫాలుగా ఆలయ ప్రారంభోత్సవం వాయిదా పడుతున్నది. గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఆలయ ప్రారంభోత్సవానికి అడ్డంకిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గొడవలు పక్కన పెట్టి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
త్వరలోనే విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతాం…
రంగనాయకస్వామి ఆలయ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆలయ ప్రారంభోత్సవం వాయిదా పడుతున్నది. ఇటీవల గ్రామ పెద్దలతో చర్చించాం. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన తేదీలను ఖరారు చేస్తాం.