అంతటా సన్నాహక సమావేశాలు
ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల హాజరు
కోదాడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లి
కమిటీల ఏర్పాటుపై దిశానిర్ధేశం
పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తల హాజరు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అప్పుడే గులాబీ జెండా పండుగ సంబురం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో మంగళవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముఖ్య నాయకులు, క్రీయాశీల కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యారు. ఇప్పటికే సిద్ధం చేసిన కార్యాచరణ మేరకు సెప్టెంబర్ 2న గులాబీ జెండాలు ఎగురవేసి, ముందుగా గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటును మొదలుపెట్టాలని ఎమ్మెల్యేలు సూచించారు. 12 నుంచి మండల కమిటీ వేయాలని పేర్కొన్నారు. అన్ని కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు 51 శాతం ఉండాలని స్పష్టం చేశారు.
చిట్యాల, ఆగస్టు 31 : టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగకు పార్టీ దిమ్మెలను సిద్ధం చేసి విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. చిట్యాలలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించుట కోసం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఈ కమిటీలే పార్టీ గెలుపులో కీలకంగా మారుతాయని, అన్ని వర్గాల వారిని కలుపుకొనిపోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం బలంగా ఉన్నపుడే పార్టీ బలంగా ఉంటుందని, సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలను, 12 నుంచి 20 వరకు మండల కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని అందుకోసం పార్టీ పరిశీలకులను నియమిస్తారని వివరించారు. సేవకుడిలా పనిచేసే చిరుమర్తి లింగయ్యకు అండగా ఉండి సంస్థాగత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పాత కొత్త తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తూ కమిటీలను ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయిలో అవకాశం రాని వారు అసంతృప్తి చెందవద్దని వారిని మండల, జిల్లా స్థాయిలో అవకాశం వచ్చేలా చూస్తామని అన్నారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, నార్మాక్ డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, వెల్మినేడు సింగిల్ విండో చైర్మన్ రుద్రారపు భిక్షపతి, నాయకులు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, అంతటి వెంకటేశ్, సత్తయ్య, రాచకొండ కృష్ణయ్య, కూరెళ్ల లింగస్వామి, ఆవుల అయిలయ్య, సుంకరి యాదగిరి, మర్ల రాంరెడ్డి, రామన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి, ఎంపీపీ జ్యోతీబలరాం, మందడి ఉదయ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి యాదవ్ పాల్గొన్నారు. రామన్నపేట మండలం సర్నేనిగూడెం మాజీ సర్పంచ్ రూపని మల్లయ్య ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
జెండా పండుగ ఘనంగా నిర్వహిద్దాం
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి, కట్టంగూరు మండలాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా తప్ప మరో జెండా అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.