పలు దశల్లో వివిధ పంటలు
వరి పొలాన్ని ఆరబెట్టి
తిరిగి నీళ్లు పెట్టాలి
వేరుశనగ, పెసర, కంది, పత్తి చేలల్లో
మందులు పిచికారీ చేయాలి
గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డి.నరేశ్
సాగులో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం వరి, వేరుశనగ, పెసర, కంది, పత్తి పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా పంటల్లో పాటించాల్సిన విధానాల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త దొంగరి నరేశ్ వివరించారు. మరింత సమాచారం కోసం రైతులు 92906 15952 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు.
వరి
వరి నారుమడి మొదలుకుని దుబ్బుకట్టే దశలో ఉన్నది. నారుమడిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు నివారించడానికి కార్బోప్యూరాన్ 3జీ గుళికలు నాటడానికి వారం రోజుల ముందు ఎకరా నారుమడికి 800గ్రాముల చొప్పున వేసుకోవాలి.
పొలంలో తొలిదశలో చౌడు, నాచు, మురుగు నీరు ఉండటం వల్ల మొక్కల వేర్లు నల్లబడి చనిపోతాయి. నివారణకు పొలాన్ని వెంట్రుక వాసి పగుళ్లు వచ్చేవరకు ఆరబెట్టి తిరిగి నీరుపెట్టి ఒక కిలో యూరియాకు 2.5 – 3గ్రాముల కార్బండిజమ్ 25శాతం + మాంకోజెబ్ 30శాతం మిశ్రమ మందును కలిపి పొలానికి అంతటా సమానంగా 20 – 25రోజుల దశలో చల్లాలి.
ముందుగా నాటిన దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాల్లో ఈ నెలలోనే బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించే ప్రమాదం ఉన్నది. ఉధృతి 5 శాతం కంటే ఎక్కువగా గమనిస్తే నత్రజని ఎరువును తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలిదశలో వ్యాప్తిని నివారించడానికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రాములు + ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లను పూర్తిగా నివారించడానికి ఎటువంటి మందులు లేవు అనే విషయాన్ని రైతులు గమనించాలి.
పెసర
పెసర పంట శాఖీయ దశ నుంచి మొగ్గ, పూత దశల్లో ఉన్నది. తొలి దశలో చుట్ట పురుగులు, రసం పీల్చే పురుగులైన తామర, పేనుబంక, తెల్లదోమలు ఆశించే అవకాశాలున్నాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీలు లేదా ఎసిఫేట్ 1.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొగ్గ/ పూత / పిందె దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే సాధ్యమైన చోట తేలికపాటి తడి ఇవ్వాలి. లేదా లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల మల్టీ కె కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.
పల్లాకు తెగులు ఆశిస్తే తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు తెల్లదోమను సకాలంలో నివారించాలి. నివారణకు డెఫెన్థయురాన్ 0.5 గ్రాములు లేదా 0.2గ్రాముల ఎసిటామిప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొగ్గ తొలిపూత దశలో 5శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీల వేపనూనె, 2.5 మి.లీల క్లోరోపైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దాంతో శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
పత్తి
పత్తి పూత దశలో ఉన్నది. ప్రస్తుత దశలో గొర్రు, గుంటుకలతో దాదాపు 10రోజులకు ఒకసారి అంతర కృషి చేయాలి. దాంతో కలుపు నివారణతో పాటు భూమిలో తేమ నిలబడి పంట పెరుగుదల బాగా ఉంటుంది.
ఎరువులే గాకుండా అవసరాన్ని బట్టి బెట్ట, అధిక వర్షపాత సమయాల్లో పంట, కాయ ఎదుగుదల దశలో పైపాటుగా పోషకాలు పిచికారీ చేయాలి.లీటర్ నీటికి 10గ్రాముల పొటాషియం నైట్రేట్ (13ః0ః45) లేదా 19 ః 19 ః19, 5 గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు, మొక్కలు ఎండిపోవడం గమనించిన చోట లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి మొక్కల చుట్టూ భూమిని తడుపాలి.
తేలిక భూముల్లో చేను ఎరుపు ఎక్కితే పూత సమయంలో లీటర్ నీటికి 1.0 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ + బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియాను కలిపి 7 – 10 రోజుల వ్యవధిలో కనీసం రెండుసార్లు పిచికారీ చేయాలి.
పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నివారణకు పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టల ద్వారా సరైన నిఘాపెట్టి తొలిపూత దశ నుంచి చేనులో కనిపించే గుడ్డిపూలను ఎప్పటికప్పుడు ఏరివేయాలి. ఆ పైన పురుగు తాకిడిని బట్టి మొదటి దశలో ప్రొఫినోఫాస్ 2మిల్లీ లీటర్లు.. లీటర్ నీటికి కలిపి మందులు మార్చుతూ అవసరం మేరకు పిచికారీ చేయాలి. మధ్యమధ్య మందులతో పాటు వేప కషాయం 5 శాతం లేదా వేపనూనెను 5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కంది
కంది పంట ప్రస్తుతం 30 – 40రోజుల దశలో ఉంది. తొలి 60రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అంతర కృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా తయారు చేస్తే భూమిలో తేమ బాగా నిలిచి బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది.
అంతర కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో కలుపు నివారణకు విత్తిన 20రోజులకు ఇమాజితాఫిర్ 300 మి.లీలు ఎకరాకు అనగా 0.5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు.
అధిక వర్షాల కారణంగా పంటలో వర్షపు నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు చిన్నచిన్న కాల్వలు తీసి నీరు తీసివేయాలి. కంది పంట నీటి ముంపును తట్టుకోలేదు.
బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేనుబంక ఆశించి మొక్కలు పాలిపోతాయి. 0.6మి.లీటర్ల మోనోక్రోటోఫాస్, 20గ్రాముల యూరియా ద్రావణం లేదా 10 గ్రాముల మల్టీ కె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వేరుశనగ
వేరుశనగ ప్రస్తుతం 30రోజుల దశలో ఉంది. ఈ దశలో పంట బెట్టకు గురైతే ఒక తడి ఇవ్వడం ద్వారా ఒకేసారి పూత వస్తుంది.
మొలక కుళ్లు తెగులు గమనిస్తే కార్బండిజమ్ + మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పిచికారీ చేసుకోవాలి.
ఒకసారి అంతర కృషి చేయడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు.
శనగ పచ్చ పురుగు లేదా పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరాకు నొవాల్యురాన్ 200మి.లీలు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 60గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగుళ్లను గమనిస్తే క్లోరోథలోనిల్ 400గ్రాముల లేదా టెబుకొనజోల్ 200 మి.లీలు 200లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.