నిరుద్యోగుల ఉపాధికి ఊతం
ఎస్సీ కార్పొరేషన్ రుణాలతో ఆర్థిక చేయూత
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 354యూనిట్లు రూ.14.07 కోట్లు
చివ్వెంల, ఆగస్టు 20 : దళిత యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలను మంజూరు చేస్తున్నది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణతోపాటు ఇంటర్వ్యూల ప్రక్రియ తుది దశకు చేరింది. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో గ్రామాలు, పట్టణాల్లో దళిత యువతీ, యువకులకు 354యూనిట్లును మంజూరు చేయనున్నది. సుమారు రూ.14.07 కోట్లు అందించనున్నది. రుణాలు పొందిన వారు సుమారు 40రకాల యూనిట్లను తీసుకునే వెసులుబాటు ఉంది.
దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దళిత బంధు ప్రకటించడం విదితమే. మరోవైపు స్వయం ఉపాధిపై ఆసక్తి కల్గిన దళిత యువతకు కార్పొరేషన్ రుణాలను సైతం మంజూరు చేస్తున్నది. 40ఏండ్ల లోపు యువతీ, యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందిస్తున్నది. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాల్టీలకు చెందిన వారికి 354యూనిట్లు ప్రకటించింది. దాంతో 4,296మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా ఇప్పటికే వారందరికీ ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తుది జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకంగా కేటాయించారు. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక్కొక్క యూనిట్‌కు రూ.2లక్షల నుంచి ఆపైన తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గరిష్టంగా రూ.5లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నది.
జిల్లా స్థాయి కమిటీలో తుది జాబితా
ఇంటర్వ్యూల్లో మెరిట్ సాధించిన వారి జాబితాను జిల్లా స్థాయి కమిటీ సిద్ధం చేస్తున్నది. కమిటీలో అదనపు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్డీఓ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఎల్డీఎం, రవాణాశాఖ అధికారి, ఉద్యానశాఖ అధికారి సభ్యులుగా ఉన్నారు.
మండలాల వారీగా రుణాల వివరాలు
అనంతగిరి 15, ఆత్మకూర్(ఎస్) 18, చిలుకూరు 12, చింతలపాలెం 5, చివ్వెంల 16, గరిడేపల్లి 22, హుజూర్నగర్ 13, హుజూర్నగర్ మున్సిపాల్టీ 7, జాజిరెడ్డిగూడెం 8, కోదాడ 27, కోదాడ మున్సిపాల్టీ 4, మద్దిరాల 10, మఠంపల్లి 9, మేళ్లచెర్వు 7, మోతె 14, మునగాల 19, నడిగూడెం 17, నాగారం 14, నేరేడుచర్ల 9, నేరేడుచర్ల మున్సిపాలిటీ 6, నూతనకల్ 16, పాలకీడు 6, పెన్‌పహాడ్ 16, సూర్యాపేట 20, సూర్యాపేట మున్సిపాల్టీ 17, తిరుమలగిరి 7, తిరుమలగిరి మున్సిపాల్టీ 6, తుంగతుర్తికి14 యూనిట్లను కేటాయించారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందిస్తున్న రుణాలను లబ్ధ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి. వీటి ఆర్థికంగా ఎదుగుదలకు వినియోగించినప్పుడే వారి కుటుంబం ఆర్థికంగా మెరుగుపడుతుంది. సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 354 యూనిట్లను మంజూరు చేసింది. వీటికి 14.07 కోట్లు రుణాలు ఇవ్వనున్నది. ఇంటర్వ్యూలు ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను సిద్దం చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నది.
-శిరీష, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్