సూర్యాపేటలోని పురాతన వేంకటేశ్వరాలయాన్ని రూ.12 కోట్లతో విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ఈ నెల 23న చినజీయర్ స్వామి భూమి పూజ చేయనున్నారు. పునర్నిర్మాణం ఎలా ఉండాలి.. ఎక్కడ ఏమి కట్టాలి అనేదానిపై మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి వల్లియనాగన్తో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ఇప్పటికే తయారు చేసిన నమూనా మ్యాపును చూసి వారు పలు సూచనలు ఇచ్చారు.
సూర్యాపేట, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి కొత్తశోభ రానుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత అధునాతనంగా రమణీయంగా ఆలయ విస్తరణ నిర్మాణాలు చేపట్టేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. తొలుత రూ.12 కోట్లతో అంచనాలు రూపొందిస్తుండగా అంతకన్నా మించి వ్యయమైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో త్రిదండి చినజీయర్‌స్వామిని కలిసి వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులపై చర్చించి భూమిపూజకు రావాలని అభ్యర్థించగా ఈ నెల 23న వచ్చేందుకు అంగీకరించారు. మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి యాదాద్రి దేవాలయ నిర్మాణంలో భాగస్వామైన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి వల్లియనాగన్తో కలిసి వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలు కలియతిరిగారు. ఇప్పటికే సిద్ధం చేసిన ఆలయ మ్యాప్‌ను పరిశీలించారు. మ్యాప్‌లో చిన్నచిన్న మార్పులు చేయాలని ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఆటంకాలు కలుగకుండా నిర్మాణాలు ఉండాలని ఆర్కిటెక్ట్‌ను కోరారు. దాతలు, భక్తుల సహకారంతో గతంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం భక్తులు వీలైనంతవరకు అభివృద్ధి చేస్తూ వచ్చారని చెప్పారు. అయితే ఆలయ నిర్మాణం జరిగి దశాబ్దాలు దాటడంతో గోడలు కుంగుతున్నాయని, భక్తుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఆలయ విస్తరణ చేపట్టాల్సిన అవసరం తప్పనిసరి అయ్యిందని అన్నారు. ఆలయం వెనుక భాగంలోని భూమిని వినియోగించుకుంటూ భక్తులు, పండితుల ఆలోచనల మేరకు చినజీయర్ స్వామిని కలిసినట్లు పేర్కొన్నారు. ఆలయ పరిస్థితులు వివరించగా వెంటనే స్వామివారు స్థపతులను పిలిచి ఎలా చేయవచ్చనే దానిపై అవగాహన కల్పించారని వివరించారు. అదేవిధంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయిని అభ్యర్థించగా ఆయనతోపాటు స్థపతి వల్లియనాగన్ వచ్చి మంగళవారం ఆలయ ప్రాంగణం మొత్తం పరిశీలించారని పేర్కొన్నారు. త్రిదండి చినజీయర్ స్వామివారి ఆశీస్సులతో ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు 23న భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చినజీయర్ స్వామి శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ మల్లికార్జున్‌రెడ్డి, ఏఈ రాజయ్య, ఆలయ పూజారి నల్లాన్‌చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, గుర్రం సత్యనారాయణరెడ్డి, టీఎస్వీ సత్యనారాయణ, గజ్జెల రవీందర్ పాల్గొన్నారు.