పహాడీషరీఫ్ : ఉస్మాన్ నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీర్‌పేట చెరువు తరహాలో ఉస్మాన్‌నగర్ బూరాన్ ఖాన్ చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ వర్షాలతో పాటు కాలనీలోని డ్రైన్‌వాటర్ మొత్తం చెరువులోకి చేరడంతో వర్షం నీరు వెనక్కి ప్రవహించి ఉస్మాన్‌నగర్‌లోని దాదాపు 200 ఇండ్లు ముంపునకు గురై రెండు సంవత్సరాల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ముంపు సమస్యకు శాశ్వతపరిష్కారం కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాదీ, కమిషనర్ జి..పి. కుమార్, కౌన్సిలర్ మజర్ అలీ, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, ఖైసర్బామ్ తితరులు పాల్గొన్నారు.