ఆరుబయట ఆకాశమంత పరుచుకున్న చలువ పందిళ్ల కింద, వేదమంత్రాల నడుమ అంతటా అంగరంగ వైభవంగా వేడుక సాగింది. ఊరుమ్మడి పండుగగా చేసే రాములవారి కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా గత రెండేండ్లు సాదాసీదాగా చేసిన నేపథ్యంలో ఈసారి ఘనంగా నిర్వహించారు. కొవిడ్ పరిస్థితులు చక్కబడడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నేత్రపర్వంగా సాగిన కల్యాణ తంతును ఆద్యంతం వీక్షించి, సీతారాముల ఆశీస్సులు పొందారు. రెండో భద్రాద్రిగా పేరున్న నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవానికి భద్రాద్రి నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వేర్వేరుగా వారి క్యాంప్ ఆఫీసుల్లో పూజలు చేసి సమర్పించారు.
– రామగిరి, ఏప్రిల్ 10
శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా నిర్వహించారు. రెండోభద్రాద్రిగా పేరు గాంచిన నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి ముత్యాల, తలంబ్రాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వేర్వేరుగా పూజలు చేసి సమర్పించారు. చింతపల్లి మండలం మాల్ రామాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవరకొండ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, కేతేపల్లి మండలం బండపాలెం పురాతన సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని పూజలు చేశారు. హాలియా, తిరుమలగిరి(సాగర్)ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, నాంపల్లి మండలం పస్నూర్‌లో సీతారామ కల్యాణంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు మండలం చీకటిమామిడి రామాలయం కల్యాణో త్సవంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు.