కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దళితబంధు అమలుకు కసరత్తు శరవేగంగా కొనసాగుతున్నది. రెండు నియోజకవర్గాలు ఉండగా.. సెగ్మెంట్‌కు వంద చొప్పున 200 మంది లబ్ధిదారులను అధికార యంత్రాంగం ఎంపిక చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 77 మంది, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనికి వచ్చే నార్నూర్, గాదిగూడ మండలాల్లో 23 మందిని.. సిర్పూర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. అధికారులు లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, కులం, నివాసం, ఆదాయం వంటి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. లబ్ధిదారులు ఒడిదొడుకులను తట్టుకొని నెలకు రూ.30వేలు సంపాదించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా లబ్ధిదారులు బొలేరో, ట్రాక్టర్లు, ట్రాలీలు, టాటా మ్యాజిక్, మినీ వాహనాలు, గొర్రెలు, గేదెలు, మేకల యూనిట్లపై ఆసక్తి చూపుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ) : అణగారిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంలో రాష్ట్ర సర్కారు దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా.. ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను మొదటి విడుతలో ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 77 మంది, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనికి వచ్చే నార్నూర్, గాదిగూడ మండలాల్లో 23 మందిని ఎంపిక చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఆసిఫాబాద్ మండలంలోని మానిక్‌గూడ(ఆడ) గ్రామంలో 14 మంది లబ్ధిదారులు, రెబ్బెనలోని పులికుంటలో 13, తిర్యాణిలోని మాణిక్యాపూర్‌లో 9, వాంకిడిలోని జైత్పూర్లో 8, కెరమెరిలోని దేవాపూర్‌లో 10, జైనూర్లోని బూసిమెట్టలో 10, సిర్పూర్-(యు)లోని రాగాపూర్ కొహినూర్‌లో ఏడుగురు, లింగాపూర్‌లోని మామిడిపల్లిలో 6.. సిర్పూర్-(టి)లో 9, కౌటాలలో 10, చింతలమానెపల్లిలో 10, బెజ్జూర్‌లో 8, పెంచికల్పేట్లో 10, దహెగాంలో 10, కాగజ్‌నగర్(రూరల్)లో 10, కాగజ్‌నగర్(అర్బన్‌లో) 22 మంది లబ్ధిదారులను పథకానికి ఎంపిక చేశారు.
దళితబంధు పథకం ద్వారా ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి రూ.10 లక్షల చొప్పున అందించనుంది. ఈ నిధుల ద్వారా యూనిట్ల ఎంపిక మొదలు వాటిని ప్రారంభించడంలో ఎదురయ్యే ఒడిదొడుకులను తట్టుకొని నిలబడేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు గాను లబ్ధిదారులు కోరుకున్న రంగాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నెలకు కనీసం రూ.30 వేల ఆదాయం వచ్చేలా వ్యాపారాలను ఎంపిక చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా లబ్ధిదారులు పశుపోషణ, రవాణా వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బొలేరో, ట్రాక్టర్లు, ట్రాలీలు, టాటా మ్యాజిక్, మినీ వాహనాలు, గొర్రెలు, గేదెలు, మేకల యూనిట్లను అత్యధికంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇంకా బట్టల, కిరాణా, పాదరక్షల దుకాణాలు పెట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, కులం, నివాసం, ఆదాయం వంటి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. వీలైనంత త్వరగా యూనిట్లను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏప్రిల్ మాసంలో వంద శాతం యూనిట్లను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంచుకున్న యూనిట్లపై పలు దఫాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమర్థవంతంగా వ్యాపారం చేసుకునేలా అవగాహన కల్పించారు. వీలైనంత త్వరగా దళితబంధును అమలు చేయనున్నారు.