Hedge Funds | మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఈ హెడ్జ్ ఫండ్స్ సైతం మదుపరుల రాబడులకు వనరులు. ఇవి కూడా రకరకాల ఆస్తుల్లో, మార్కెట్లలో పెట్టుబడులు పెడుతాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మధ్య కొన్ని వ్యత్యాసాలున్నాయి. హెడ్జ్ ఫండ్స్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద నమోదు కావు. కాబట్టి వీటిపై సెబీకి నియంత్రణేదీ ఉండదు. వీటిని ప్రైవేట్‌గా నిర్వహిస్తారు. అలాగే వీటి ప్రధాన లక్ష్యం.. మార్కెట్లలో ఎటువంటి పరిస్థితులున్నా సంప్రదాయేతర మదుపు వ్యూహాలను అనుసరించి అధిక రాబడులను ఒడిసిపట్టుకోవడమే. కానీ ఇది చాలా రిస్క్‌తో కూడుకున్నది.
అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక రకంగా రిస్కే. అయినా హెడ్జ్ ఫండ్స్‌తో చూస్తే తక్కువే. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లుంటే, హెడ్జ్ ఫండ్స్‌లో సంపన్నులు లేదా సంస్థాగత మదుపరులుంటారు. కనుక హెడ్జ్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడే చాలా అధికంగా ఉంటుంది. ఈ ఫండ్‌పై, దాని పనితీరుపై ఖర్చు, ఫీజులు ఆధారపడి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లోనైతే సెబీ, ఏయూఎంపై ఇవి ఆధారపడుతాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా హెడ్జ్ ఫండ్స్ పారదర్శకంగా ఉండవు. తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)ను ప్రకటించవు.