
ములుగు, సెప్టెంబర్ 29 : భూనిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్నదని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. బుధవారం ములుగులోని క్యాంపు కార్యాలయంలో గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించి గుడాటిపల్లి, సామాజితండాల్లో పెండింగ్ భూసేకరణ, ప్యాకేజీ పంపిణీ, నిర్వాసితుల తరలింపుపై రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ భూసేకరణ, ప్యాకేజీ పంపిణీ వివరాలను హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి వివరిచారు. ప్రాజెక్ట్ పరిధిలో 1.4 టీఎంసీల నీటిని నింపడంతో ముంపునకు గురయ్యే 687 మంది నిర్వాసితుల కుటుంబాలకు ఇండ్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఐదేండ్ల క్రితమే అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు పూర్తి చేసేందుకు 272 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ. 58కోట్లు కలెక్టర్ ఖాతాకు జమ చేసిందని తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణంలో మిగిలిన పనులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.