
అందోల్/వట్పల్లి, అక్టోబర్ 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, మన సంప్రదాయంలో అలయ్ బలయ్‌కి ఎంతో గొప్ప స్థానం ఉందని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం వట్పల్లి మార్కెట్ యార్డులో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ప్రొటెం చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అలయ్ బలయ్ లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలందరినీ ఒకచోటుకు చేర్చడంలో ఎమ్మెల్యే క్రాంతి పాతరోజులు గుర్తుచేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి సైతం క్రాంతికిరణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. పటుబట్టి తన నియోజకర్గానికి సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను తీసుకువచ్చారని, ఈ ప్రాజెక్టుతో నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు.
ఆటపాటలతో తెలంగాణ అభివృద్ధిని వివరించిన గోరటి వెంకన్న
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన ఆటపాటలతో తెలంగాణ అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని, అభివృద్ధికి ఆకర్షితుడనై గులాబీ చొక్కా ధరించానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిపోయిన చెరువులు, పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లే కూలీ లు దర్శనమిచ్చేవారని కానీ, స్వరాష్ట్రంలో అలుగు పారుతున్న చెరువులు, పచ్చని పంటలతో పొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. కూలీలకు చేతినిండా పని దొరుకుతూ సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇతర రాష్ర్టాలకు కూలీకి వెళ్లే తెలంగాణ బిడ్డలు సొంత రాష్ట్రంలో దర్జాగా బతుకుతున్నారన్నారు. పొరుగు రాష్ర్టాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారని, ప్రజలు కొరుకున్న బంగారు తెలంగాణ అని ఆటపాటల రూపంలో వివరించారు.
రెండేండ్లలో మరింత అభివృద్ధి చేస్తాం : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందరి సహకారంతో రానున్న రెండేండ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రతిపక్షాల కండ్లు తెరిపిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. అనంతరం మండలంలోని షాద్‌నగర్‌కు చెందిన అంజయ్య-మేఘమాల కుతురు ఐశ్వర్య మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో ప్రొటైం చైర్మన్‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
అలరించిన మిట్టపల్లి సురేందర్, మంగ్లీ
అలయ్ బలయ్ కార్యక్రమం ధూంధాంగా సాగింది. మిట్టపల్లి సురేందర్, మంగ్లీ గీతాలు, గోరటి వెంకన్న స్టెప్పులతో మార్కెట్ యార్డు దద్దరిల్లింది. దసరా, బతుకమ్మ పండుగల విశిష్టతను వివరిస్తూ తెలంగాణ జానపదాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ పాడిన పాటలు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపాయి. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మారుతిసాగర్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జాగృతి కార్యదర్శి భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, ఎంపీపీ కృష్ణవేణి, రైతుబంధు అధ్యక్షుడు అశోక్‌గౌడ్, వరము చైర్మన్ వీరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి శివాజీ, సర్పంచ్ సురేఖ బుద్ధిరెడ్డి, ఎంపీటీసీ ఇందిరారాజేందర్, నియోజవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.