
గౌరవెల్లి రిజర్వాయర్ ప్రగతిపై హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, త్వరలోనే భూసేకరణ పనులు పూర్తి చేసి రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కిషన్‌నగర్ వద్ద 40డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
హుస్నాబాద్, సెప్టెంబర్ 15: గౌరవెల్లి రిజర్వాయర్‌పై హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, త్వరలోనే భూసేకరణ పనులు పూర్తిచేసి రిజర్వాయర్‌ను సత్వరంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇప్పటి వరకు 80శాతం మందికి పరిహారం అందిందని, త్వరలోనే మిగతా 20శాతం మందికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.58 కోట్ల నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేసిందన్నారు. కొన్ని కఠినమైన చర్యలు తీసుకోనైనా గౌరవెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కిషన్‌నగర్ వద్ద 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేశారన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ద్వారా రూ.20వేలు, మృతి చెందిన జర్నలిస్టులకు రూ.2లక్షలు ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి మూడేండ్ల పాటు రూ.3వేల చొప్పున పింఛన్ ఇస్తున్నదని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక అక్రిడిటేషన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. హుస్నాబాద్‌లో జర్నలిస్టులకు సకల సౌకర్యాలతో కూడిన ఆదర్శ కాలనీని నిర్మించేందుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుందని, దీనికోసం రూ.10వేల కోట్లు కేటాయించిందన్నారు. త్వరలోనే 50 నుంచి లక్ష లోపు రుణాలు మాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. హుస్నాబాద్ మండలంలోని 7గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. హుస్నాబాద్ పట్టణానికి వరద ముంపు లేకుండా రూ.12 కోట్లతో పనుల చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. హుస్నాబాద్ ప్రెస్‌క్లబ్ భవనంపై మీటింగ్ హాల్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రక టించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్, కమిషనర్ రాజమల్లయ్య, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నన్నె అజయ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, అక్కన్నపేట అధ్యక్షుడు మ్యాక నారాయణ, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు: ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మంత్రి హరీశ్‌రావు కృషితో మరమ్మతు పనులు మొదలైనట్లు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు నేషనల్ హైవే నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.