
కంపుకొట్టే డ్రైనేజీలు..వీధుల్లో మురుగు.. పెంటకుప్పలు..పేరుకుపోయిన చెత్తాచెదారం..పాడుబడిన ఇండ్లు. దుర్వాసన..పిచ్చిమొక్కల దర్శనం ఒకప్పుడు పల్ల్లెల్లో కనిపించే దృశ్యాలు. ఇది అప్పటి మాట.. ఇప్పుడు గ్రామాలు మారాయి. ప్రగతి పథాన పయనిస్తున్నాయి. అభివృద్ధితో వికసిస్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రంతో కొత్తశోభను సంతరించుకున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు నెలనెలా నిధులు విడుదల చేస్తుండడం,పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుతో పల్లెల స్వరూపమే మారిపోయింది. అపరిశుభ్రత దూరమై పల్లె శుభ్రంగా మారింది. ఇంటింటా చెత్త సేకరణ జరగుతున్నది. చెత్త నుంచి డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారవుతున్నది. నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. గుణాత్మక మార్పు కనిపిస్తున్నది. పంచాయతీల ఆధ్వర్యంలో పారదర్శక పాలన కొనసాగుతున్నది. పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. పట్టణాలతో దీటుగా సౌకర్యాలు సమకూరుతున్నాయి. గతంతో పోలిస్తే పల్లె జీవనం సౌకర్యకరంగా మారింది.
సిద్దిపేట, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బతుకమ్మ, దసరా పండుగకు జనాలు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇది వరకు సొంతూరు రావాలంటే ఆలోచించేవారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిస్తున్నది. గ్రామ పాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అందించడంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెల్లో పచ్చని, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. పట్టణాలతో మాదిరిగా పల్లెలు సౌకర్యాలు సమకూరుతున్నాయి. దీంతో ఇప్పుడు పల్లెల్లో గడపడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కిరణ్ అవార్డును ఉత్తమ జిల్లా పరిషత్గా సంగారెడ్డి సొంతం చేసుకుంది. ఇదే అవార్డు కింద సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలోని మల్యాల, మిట్టపల్లి గ్రామాలు అవార్డులు అందుకున్నాయి.
పంచాయతీ ప్రత్యేక యాప్..
పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ గ్రామంలో చేపట్టిన పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ తదితర పనుల వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో నుంచి లైవ్ ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. పంచాయతీ నిధులను ఎలా ఖర్చు చేశారు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతోపాటు అభివృద్ధి పనుల ఫొటోలను, గృహ నిర్మాణాలు, వ్యాపార వాణిజ్య సంస్థల వాటికి అనుమతులు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు తదితర వాటిని యాప్‌లో ఎప్పటికప్పుడు పొందు పరుస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఏం జరుగుతుందని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకునే వీలు కలుగుతున్నది. ఈ పల్లె ప్రగతి యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పర్యవేక్షణ సులభతరంగా మారింది.
గ్రామాలకు ప్రతినెలా నిధులు…
నెలనెలా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను అందిస్తున్నది. ఈ నిధులతో పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠధామాలు, తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులకు తరలింపు, సేంద్రియ ఎరువుల తయారీ వంటి పనులు చేపడుతున్నారు. గ్రామాలకు ఇతర అభివృద్ధి పనులకు నిధులు అదనంగా వస్తున్నాయి. నిధుల వరద పారుతుండడంతో గ్రామాలు పరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నాయి.
గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..
సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు అన్నిచోట్ల డంపింగ్ యార్డులు నిర్మించారు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామాలకు గాను 489 గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 469 గ్రామాలకు గాను 469 గ్రామాల్లో నిర్మించారు. ఇంటింటా చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఊరికో పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్‌లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వాకింగ్ ట్రాక్‌లు, నర్సరీల ఏర్పాటుతో పల్లెలు పట్టణాలతో పోటీపడుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి.
ప్రతి మండల కేంద్రంలో బృహత్ ప్రకృతి వనం..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల విస్త్తీర్ణంలో ఖాళీ ప్రదేశం లేదా ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తున్నారు. మండల కేంద్రంలో అనువైన స్థలం లేకపోతే అదే మండలంలోని ఏదైనా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. బాహ్య వలయంలో 3 వరుసల్లో పొడవైన మొక్కలు కనీసం 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల పొడవు తగ్గకుండా మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో నీడనిచ్చే, పండ్లు ఇచ్చే మొక్కలు నాటుతున్నారు. గుర్తించిన స్థలాన్ని నాలుగు సమానమైన భాగాలుగా విభజించి మధ్యలో 0.75 ఎకరం విస్తీర్ణంలో పిల్లల ఆటస్థలానికి కేటాయిస్తారు. 10 ఫీట్లు పాదచారుల దారిని, నీటి సదుపాయానికి, అంతర్భాగంలో 8 ఫీట్ల దారిని కేటాయిస్తారు. 0.75 ఎకరా విస్తీర్ణంలో పిల్లల ఆటస్థలానికి నిర్దేశించారు. పిల్లలకు కేటాయించిన స్థలంలో కూర్చోవడానికి అవసరమైన బల్లలు ఏర్పాటు చేస్తారు. బృహత్ ప్రకృతి వనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారు.
పచ్చదనం ఉట్టిపడేలా…
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన రహదారులకు, వీధుల్లో ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని వాతావరణం కనిపిస్తున్నది. ప్రతి ఇంటికీ వివిధ రకాల పండ్ల మొక్కలు అందించి నాటించారు. హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామానికి నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ‘పవర్ డే’ ను నిర్వహించి ఆయా గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను పరిష్కరించారు.