
ఝరాసంగం, ఆగస్టు 9 : మండల కేంద్రమైన ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ మాసం పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న పార్వతీ సమేత సంగమేశ్వరుడికి రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకుల పూజ, కుంకుమార్చన, అన్నపూజ తదితర పూజలు చేశారు. కేతకీ దేవాలయం పరిసరాల్లో ఆధ్మాతిక శోభ సంతరించుకుంది. మండలంలోని ఈదుపల్లి గ్రామ శివారులో ఉన్న రేవణ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవో మోహన్‌రెడ్డి, ఎస్సై గోపి బందోబస్తు నిర్వహించారు.
గుమ్మడిదల, ఆగస్టు 9 : భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన, పూజా కార్యక్రమాలను వేదపండితులు వైభవంగా ప్రారంభించారు. సోమవారం వీరన్నగూడెంలోని బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో ఈవో శశిధర్‌గుప్తా ఆధ్వర్యంలో శ్రావణమాసం పూజలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, సద్ది విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వీరభద్రస్వామి వారికి, భద్రకాళీ అమ్మవారికి ఎంపీపీ ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం వీరభద్రస్వామి వారికి బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూప్రతి నిత్యం స్వామివారికి బిల్వార్చనలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, వీరభద్ర ప్రాస్తాయాలు, రుద్రాభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులు భౌతికదూరాన్ని పాటించి, మాస్క్‌లు ధరించి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొన్నబోయన వేణు, ఆలయ వతనుదారులు ఆలేటి జగనమోహన్‌రెడ్డి, మాజీ ధర్మకర్తలు లక్ష్మీనారాయణ, జూనియర్ అసిస్టెంట్ సోమ య్య, ప్రధాన అర్చకుడు, భక్తులు పాల్గొన్నారు.