
అన్నిరంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళితబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. విడుతల వారీగా దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. చేర్యాల ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తగిన నిధులు కేటాయిస్తామన్నారు.
చేర్యాల, ఆగస్టు 9: దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ‘తెలంగాణ దళితబంధు’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దళితబంధు ఓ అద్భుత పథకమని, రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ పథకం అమలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. దళితులు సంఘటితంగా కావాలని పిలుపునిచ్చారు. దళితబంధు పథకం ఎస్సీలను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం డబ్బులను ఆదాయం పెంపొందించే ఉపాధి, వ్యాపార మార్గాలపై వెచ్చించాలని సూచించారు. దశల వారీగా అన్ని కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ముస్త్యాల కిష్టయ్య, ముస్త్యాల నాగేశ్వర్రావు, కౌన్సిలర్ మంగోలు చంటి, రామగల్ల పరమేశ్వర్, రామగల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల పట్టణంలో అంబేద్కర్ భవనానికి శంకుస్థాపనతో పాటు పట్టణంలో రూ.86 లక్షలతో బస్టాండ్ విస్తరణ పనులకు, పెద్దమ్మగడ్డ పాఠశాలలో కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతులకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. అనంతరం చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండలాల అభివృద్ధ్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు.
చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సూచించారు. పట్టణంలోకి వరద నీరు రాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీకృత ప్రభుత్వ కార్యాలయల సముదాయం భవనం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ కార్యాలయం, మా ర్కెట్ స్థలంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మిస్తామన్నారు. చేర్యాలలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రఘునందన్‌రావుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఆర్డర్ ఇవ్వాలని కోరారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట, చేర్యాల, దుద్ద్దెడ వరకు రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేస్తామని తెలిపారు. జనగామ నుంచి దుద్ద్దెడ క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులకు అనుమతులు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అధికారులకు అప్పగించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, మరోమారు చెప్పకుండా వచ్చి పనులు పరిశీలిస్తానని మంత్రి హెచ్చరించారు. నాలుగు మండలాల నుంచి తనకు ఇచ్చిన వినతులను మంచి పరిశీలించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఎంపీపీలు బి.కృష్ణారెడ్డి, కరుణాకర్, కీర్తన కిషన్, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, సిలువేరు సిద్ధప్ప, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లేశం, యాదగిరి, మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్లు పుర్మ వెంకట్‌రెడ్డి, నిమ్మ రాజీవ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లేంగల ఏకానందం, నాగపురి కిరణ్‌కుమార్, కోతి విజయ్‌రావు, జింకల పర్వతాలు, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, డైరెక్టర్ బత్తిని నర్సింహులు, కౌన్సిలర్లు, మార్కెట్, కొమురవెల్లి టెంపుల్ డైరెక్టర్లు, నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమీక్ష నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావుకు తాము రుణపడి ఉంటామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సమీక్ష అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు చేర్యాల ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకువస్తారని తెలిపారు. మున్సిఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందని, అలాగే నూతన కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు రెండు రోజుల్లో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం మొదటగా ప్రారంభిస్తామని, అనంతరం దశల వారీగా మిగితా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు.