
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నది… ఇందుకోసం వైద్యాన్ని పేదవారికి మరింత చేరువ చేస్తున్నది. ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ దవాఖానల్లో ‘టెలీ మెడిసిన్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిద్వారా ప్రత్యేక వైద్య నిపుణులు సేవలు అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతవాసులకు, నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తీసుకువచ్చినటెలీ మెడిసిన్ విధానాన్ని ఇప్పటికే గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ప్రారంభించగా, గ్రామీణుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు 175 మందికి సేవలు అందించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో సేవలను ప్రారంభించారు. మొత్తం జిల్లాలోని 34 పీహెచ్‌సీల్లో నుంచి టెలీ లేదా వీడియో కాలింగ్ ద్వారా రోగులు సలహాలు, సూచనలు పొందనున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్లు ప్రతి రోజూ 12 గంటల నుంచి 2 మధ్యాహ్నం గంటల వరకు అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ వైద్య సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 7 : గ్రామంలో ఉంటూ దవాఖానకు వెళ్లకుండానే ఆధునిక టెక్నాలజీతో ఆన్లైన్లో వైద్యం పొందే ప్రక్రియను టెలీ మెడిసిన్ అంటారు. నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో టెలీ మెడిసిన్ విపరీతమైన ఆదరణ పొందింది. కార్పొరేట్ దవాఖానలు సైతం టెలీ మెడిసిన్ సర్వీసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతవాసులకు, నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది.
కరోనా నేర్పిన పాఠాలతో..
కరోనా మనకు అనేక పాఠాలు నేర్పింది. పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి నిజం చేసింది. నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు వారికి కార్పొరేట్ వైద్య సేవలు అందించడం, ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కుటుంబ సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లాలో సెప్టెంబర్ 8 నుంచి టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదటగా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చా యి. ఇప్పటివరకు జిల్లాలో 175 మందికి ఈ విధానంలో వైద్యసేవలు అందించారు. సిద్దిపేట ప్రభు త్వ దవాఖానతోపాటు జిల్లావ్యాప్తంగా 34 ప్రాథమిక ఆరో గ్య కేంద్రా(పీహెచ్‌సీలు)ల్లో దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే అన్ని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులకు గజ్వేల్‌లో టెలీ మెడిసిన్ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి వచ్చిన బృందం శిక్షణ ఇచ్చింది. టెలీ మెడిసిన్ సేవల్లో భాగంగా రోగికి మెరుగైన వైద్యం కావాల్సి వస్తే వారికి హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా జనరల్ దవాఖానల్లో వైద్యం చేయించే ఏర్పాట్లు చేశారు.
టెలీ మెడిసిన్ సేవలు పొందడం ఇలా…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన రోగిని మెడికల్ ఆఫీసర్ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం అవసరం ఉంటే.. ఆ రోగికి టెలీ మెడిసిన్ గురించి వివరిస్తారు. రోగి ఒప్పుకుంటే అతడికి అందించాల్సిన వైద్య సేవల కోసం వివరాలు నమోదు చేసు కుంటారు. టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన web.based అప్లికేషన్ ద్వారా సంబంధిత కన్సల్టెన్సీ వైద్యుడి అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. ఏ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుందో ఆశ వర్కర్ల ద్వారా సమాచారం ఇచ్చి రోగిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి ఆన్లైన్లో అతడికి వైద్యం ఇప్పిస్తారు. రోగ నిర్ధారణ పరీక్షలు అవసరమైతే తెలంగాణ డయాగ్నోస్ట్టిక్ హబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. రోగికి కావాల్సిన మందులు ఎలక్ట్రానిక్ ప్రిస్కిప్షన్‌లో రాసి, వాటిని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందజేస్తారు. ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే నిమ్స్, ఉస్మానియా జనరల్ దవాఖాల్లో వైద్యుల అపాయింట్మెంట్ను ఇప్పిస్తారు. టెలీ మెడిసిన్ సేవల్లో భాగంగా ఏ రోజు.. ఏ స్పెషలిస్ట్ అందుబాటులో ఉంటారనే వివరాల కోసం ప్రత్యేక చార్ట్‌ను రూపొందించారు. స్పెషలిస్టు వైద్యులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా టైమ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. డాక్టర్ ఆన్లైన్లో రాగానే బెల్ మోగుతుంది. అప్పుడు పేషెంట్‌కు అపాయింట్మెంట్ ఇస్తారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
రోగులకు వైద్య ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభు త్వం టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు పొందేందుకు పీహెచ్‌సీని రోగులు సంప్రదించాలి. టెలీ మెడిసిన్ సేవలు అందించేందుకు జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చాం. రోగులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభం
సిద్దిపేట, అక్టోబర్ 7 : రోగులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించిందని డీఎంహెచ్‌వో మనోహర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళఅరసి అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో టెలీ మెడిసిన్ సేవలను సూపరింటెండెంట్ కిషోర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాధిక, ఆర్ఎంవో చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రత్యేక వైద్య సేవలను టెలీ మెడిసిన్ ద్వారా అందించవచ్చన్నారు. దీని ద్వారా చిన్నపిల్లలకు, పెద్దలకు చర్మ, కిడ్నీ, జనరల్ సర్జరీ, ఫిజియోథెరఫీ, జనరల్ మెడిసిన్ సేవలను పొందవచ్చన్నారు. దూరంగా ఉండి రాలేపోలేకపోయిన వారు దగ్గరలోని పీహెచ్సీ వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకొని తమ వివరాలు నమోదు చేయించుకుంటే ప్రత్యేక డాక్టర్‌తో మాట్లా డి చికిత్స అందిస్తారన్నారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ రాజేందర్, ట్రస్ట్ టెక్నికల్ సపోర్టర్ కిష్టయ్య పాల్గొన్నారు.