
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 5 : నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. తిరిగి 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి 17న జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధన కొనసాగుతున్నది. రోజుకురోజుకూ హాజరుశాతం పెరుగుతున్న క్రమంలో బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో మళ్లీ సెలవులు వచ్చాయి. పాఠశాలలు ప్రారంభమైన రోజు 30శాతం ఉన్న హాజరు నిన్నటి వరకు 60 శాతానికి చేరువలో ఉంది.
విద్యార్థుల సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి..
కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం జిల్లాలో దాదాపుగా 14వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో భౌతికంగా ప్రవేశాలు పొందారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆన్లైన్లో వివరాలు పొందుపర్చాలని డీఈవో రవికాంతారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ బుధవారంలోపు childinfo/ studentinfo లో నమోదు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కూడా తమ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులందరి వివరాలు childinfo లో బుధవారం లోపు నమోదు చేయాలని ఆదేశించారు.