
పచ్చదనంతోనే పర్యావరణం, భావితరాల మనుగడ సాధ్యం. ఈ విషయాన్ని విద్యార్థులకు బోధిస్తూ చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. తాను ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పాఠశాలను పచ్చగా మారుస్తూ తోటి ఉపాధ్యాయులతో కలిసి మొక్కల పెంపకంపై విద్యార్థులను చైతన్య పరుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గోసాన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుల లక్ష్మణ్ విద్యార్థులకు చిన్నతనం నుంచే ప్రాణవాయువుపై పాఠాలు బోధిస్తూ మొక్కల పెంపకంపై పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు…
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల లక్ష్మణ్, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించటంతో పాటు విద్యార్థులకు మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యవంతం చేస్తున్నారు. పాఠశాలలో పచ్చదనంపై వ్యాస రచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం, గుణాత్మక విద్యనందించండంతో గ్రామస్తులు తమ పిల్లలను సర్కారు బడిలోనే చదివించేందుకు ఆసక్తి కనబరుచుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 112 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదిలో బోధించటంతో పాటు చెట్టు నీడలో చల్లని వాతావరణం, పర్యవరణంపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహించటం విశేషం. పిల్లలకు పంటపొలలపై, పచ్చదనం, పర్యవరణంపై గ్రామంలో ఉన్న వనురులను చూపిస్తూ ప్రత్యేక్ష అవగాహన కల్పిస్తుంటారు. ఉపాధ్యాయుల సేవలను గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు ప్రత్యేకం అభినందిస్తున్నారు.
పచ్చదనంపై చిత్రలేఖన పోటీలు…
పాఠశాలలో పచ్చదనం, పర్యావరణంపై 5వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఓ సబ్జెక్టుగా బోధిస్తూ వాటిపై చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందజేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పచ్చదనం, పర్యావరణంపై ప్రత్యేక ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు దృష్టి సారించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కల సంరక్షణపై విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేశారు. పచ్చదనంపై విద్యార్థులు చిత్రలేఖనం ద్వారా అందమైన చిత్రాలు వేసి ఉపాధ్యాయుల, గ్రామ పెద్దల మన్ననలు పొందుతున్నారు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే..
మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ సారు ప్రోత్సాహంతోనే చిత్రలేఖనంలో రాణిస్తున్నాం. పచ్చదనం మంటే చెట్లు నాటడమే కాదు, వాటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేయటమే. చెట్లను నరకటంతో భవితరాలకు ప్రాణ వాయివు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది.
పాఠశాలలో మొక్కలు నాటుతున్నాం..
మా ఉపాధ్యాయుల సూచలనతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్నాం. ఒక్కో తరగతి నుంచి ఒక్కో విద్యార్థితో ఒక కమిటీగా వేసుకుని మొక్కలు సంరక్షిస్తున్నాం. పచ్చదనంపై పోటీలు నిర్వహించి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతున్నాం.
మా ఉపాధ్యాయులు చెప్పిన సూచనలతో గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాం. పచ్చదనంతోనే మనిషి మనుగడ సాధ్యపడుతుంది. మా పొలంలో జామ, మామిడి, నేరేడు మొక్కలు నాటాను. మా బడిలో పాఠాలతో పాటు జనరల్ నాలెడ్జ్ విషయాలను తెలుసుకోవటం సంతోషంగా ఉంది.
పర్యవరణ రక్షణపై అవగాహన కల్పించేందుకే…
గోసాన్‌పల్లి జిల్లాకు మారుమూలగా ఉంటుంది. వ్యవసాయమే ఈ గ్రామ ప్రజల జీవనాధారం. పంటలపై, మొక్కల పెంపకంపై విద్యార్థులకు ఆసక్తి ఉన్నది. పాఠశాల ఆవరణలో సుమారు 2 వందల మొక్కలను పెంచుతున్నాం. తరగతి గదిలో బోధించటంతో పాటు పలు సందర్భాల్లో పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నం. పర్యావరణంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు ఫీల్డ్ ద్వారా అవగాహన కల్పించటంతో భవిష్యత్‌లో పర్యావరణ ప్రేమికులుగా ఎదుగుతారన్న నమ్మకమున్నది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ధర్మసాగర్పల్లి.. ఆకుపచ్చని లోగిలి
కోహెడ, అక్టోబర్ 4: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని ధర్మసాగర్పల్లి ఆకుపచ్చని అందాలతో ఆకట్టుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం విడుతల వారీగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారి ప్రకృతి అందాలను తెచ్చిపెట్టాయి. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చని తోరణంగా కనువిందు చేస్తూ గ్రామానికి స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ లోనె సుజాత, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప, జీపీ పాలకవర్గాన్ని ప్రశంసించారు.
ఆకట్టుకుంటున్న సంగాపూ ర్ప్రకృతి వనం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సంగాపూర్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అందరినీ ఆకట్టుకుంటున్నది. తీరొక్క మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అందులో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. బోరుబావి తవ్వించారు. గ్రామస్తులు సేదతీరడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయడంతో ప్రకృతి ప్రేమికులు ఇక్కడకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.