
మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఒకప్పుడు తెల్ల బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. సాగునీరు తక్కువగా ఉండి వర్షాధారంతో ఈ ప్రాంత రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగుచేసేవారు. ఆరుతడి పంటలకే పరిమితమైన ఈ ప్రాంత రైతులు ఇప్పుడు కమాండ్ ఏరియాలను తలదన్నేలా వరి సాగుచేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో సాగు పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పత్తి సాగును పక్కన పెట్టి రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ‘తెల్ల బంగారం’ పత్తి పంటకు హుస్నాబాద్ ప్రాంతంలో వన్నె తగ్గినట్లయ్యింది. రెండేండ్లుగా జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. ఎటుచూసినా పచ్చని వరి పైర్లు దర్శనమిస్తున్నాయి.
హుస్నాబాద్, అక్టోబర్ 1 : మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఒకప్పుడు తెల్ల బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. సాగునీరు తక్కువగా ఉండి వర్షాధారంతో ఈ ప్రాంత రైతులు పత్తి పంటను విస్తారంగా సాగు చేసేవారు. ఆరుతడి పంటలకే పరిమితమైన హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులు ఇప్పుడు కమాండ్ ఏరియాలను తలదన్నేలా వరిపంట సాగుచేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో రైతుల సాగు పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పత్తి పంట సాగును పక్కన పెట్టి వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తెల్లబంగారం పత్తి పంటకు హుస్నాబాద్ ప్రాంతంలో వన్నె తగ్గినట్లయ్యింది. నిత్యం కరువు కాటకాలతో ఇబ్బందులు పడే హుస్నాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు పత్తి పంటను బాగా సాగు చేసేవారు. పత్తి దిగుబడి అధికంగా ఉండడంతో హుస్నాబాద్ డివిజన్లో 6 జిన్నింగ్ మిల్లులు వెలిశాయి. ఒకప్పుడు ఎటు చూసినా పత్తితో నిండి ఉండి కళకళలాడే జిన్నింగ్ మిల్లులు రెండేండ్లుగా వెలవెలబోతున్నాయి. నీటి వసతి పెరగడంతో పత్తిలాంటి పంటల సాగును పక్కనపెట్టి వరిపైన రైతులు దృష్టి సారించడంతో రికార్డు స్థాయిలో సాగవుతున్నది.
తగ్గిన పత్తి సాగు…
హుస్నాబాద్ డివిజన్లోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 2019 వానకాలంలో 60వేల ఎకరాలకు పైగా పత్తిపంట సాగైంది. 2020 వానకాలంలో 53,613 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ఈ సారి వానకాలంలో 30,775 ఎకరాల్లో మాత్రమే పత్తి పంట సాగైంది. అక్కన్నపేట మండలంలో 2,737 ఎకరాల్లో ఈ ఏడాది పత్తిసాగు కాగా, బెజ్జంకిలో 8,556, హుస్నాబాద్‌లో 3,434, కోహెడలో 7,745, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 8,301 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. గతేడాది మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 14,137 ఎకరాల్లో పత్తిపంట సాగై డివిజన్లో మొదటి స్థానంలో నిలవగా, ఈ సారి ఇక్కడ కేవలం 8,301 ఎకరాల్లో మాత్రమే సాగై డివిజన్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 8,556 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేసి బెజ్జంకి మండలం మొదటి స్థానంలో ఉంది. కేవలం 3,434 ఎకరాల్లో పత్తిపంట సాగు చేసిన హుస్నాబాద్ మండలం చివరి స్థానంలో ఉన్నది.
రికార్డు స్థాయిలో వరి సాగు..
హుస్నాబాద్ డివిజన్లో సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. 2019లో 50వేల ఎకరాల్లోపే సాగైన వరిపంట 2020 వానకాలంలో 64,601 ఎకరాలకు పెరిగింది. ప్రస్తుతం 80,686 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే ఈ సారి 16,085 ఎకరాల్లో వరిసాగు పెరిగింది. కాగా, గతేడాది డివిజన్ మొత్తం కలిపి కేవలం 2,255 ఎకరాల్లో సాగైన మొక్కజొన్న పంట, ఈ సారి 7,936 ఎకరాలకు పెరిగింది. పత్తి పంట కంటే ఈ సారి మొక్కజొన్న పంట సాగుకు రైతులు ప్రాధాన్యమిచ్చారని చెప్పొచ్చు. ఇక ఇతర పంటలకు వస్తే వేరుశనగ 124 ఎకరాల్లో సాగు కాగా, నువ్వులు 16 ఎకరాలు, మినుములు 9 ఎకరాలు, పెసర 129 ఎకరాలు, కందులు 4,670 ఎకరాల్లో సాగయ్యాయి. ఒకప్పుడు ఆరుతడి పంటలకు నెలవుగా ఉన్న హుస్నాబాద్ ప్రాంతంలో ఇప్పుడు వాటి ఊసే కనబడకపోవడం విశేషం.
సమృద్ధిగా సాగునీరు ఉండడమే కారణం…
హుస్నాబాద్ ప్రాంతంలో గతంలో సాగునీటి వనరులు తక్కువగా ఉండేవి. దీంతో ఆరుతడి పంటలైన పత్తి, మక్క, కంది, వేరుశనగ తదితర ఆరుతడి పంటలను రైతులు వేసేవారు. గడిచిన మూడేండ్లుగా వర్షాలు విస్తారంగా కురవడంతో సాగునీరు సమృద్ధిగా ఉంటోంది. దీంతో ఆరుతడి పంటల స్థానంలో వరిపంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తిని చూపుతున్నారు. కేవలం ఒక పంటకు మాత్రమే పరిమితం కావడంతో ప్రయోజనం ఉండదు. పత్తిపంట సాగు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. వరిపంటలో పని తక్కువే, లాభం కూడా తక్కువే ఉంటుందనేది రైతులు గమనించాలి. – పి.మహేశ్, వ్యవసాయశాఖ ఏడీ హుస్నాబాద్