
హుస్నాబాద్, అక్టోబర్ 4: గౌరవెల్లి రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలను చర్చలు జరిపి పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్రాంరెడ్డి అన్నారు. కంపల్సరీ అవార్డు చేయడంతో నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చర్చలు జరుపుతున్నామని అన్నారు. సోమవారం సాయంత్రం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువును స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. మినీ ట్యాంక్‌బండ్ మిగులు పనులు, బతుకమ్మ ఏర్పాట్లు తదితర అంశాలను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌరవెల్లి రిజర్వాయర్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రిజర్వాయర్ కింద కేవలం 271ఎకరాల భూమి మాత్రమే సేకరించాల్సి ఉన్నదని, ఇటీవల ఈ రైతులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. రిజర్వాయర్ పనులు, పరిహారం చెల్లింపు దాదాపు పూర్తయినందున మిగతా పనులు, పరిహారం చెల్లింపులు పూర్తి చేసి త్వరలోనే గౌరవెల్లి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనులు అసంపూర్తిగా ఉన్నందున ప్రత్యేక దృష్టిసారించి మిగులు పనుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. చెరువు కట్టపై బతుకమ్మ పండుగ రోజున వేలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు సూచించామన్నారు.
గోదావరి జలాలతో
హుస్నాబాద్ సస్యశ్యామలం: ఎమ్మెల్యే
గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించి త్వరలోనే గోదావరి జలాలతో నింపి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. మెట్ట ప్రాంతాన్ని పచ్చగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ 1.23 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ను 8.23టీఎంసీలకు పెంచారన్నారు. రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. త్వరలోనే రిజర్వాయర్ పూర్తయి హుస్నాబాద్ ప్రాంత పంటపొలాల్లో గోదారి నీళ్లు పారడం ఖాయమన్నారు. నిర్వాసితులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే వారితో పలుమార్లు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేటలోని కోమటి చెరువుకు దీటుగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎల్లమ్మ చెరువుపై జరిగే బతుకమ్మ వేడుకలకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారును ఆదేశించారు. నియోజకవర్గంలోని పలు భూసమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్, కమిషనర్ రాజమల్లయ్య, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, అక్కన్నపేట ఎంపీపీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.