
గజ్వేల్, అక్టోబర్ 3: రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఏడు విడుతల్లో విజయవంతంగా నిర్వహించారు. ఉద్యమంలా సాగుతున్న ఈ కార్యక్రమం పర్యావరణాన్ని పూర్తిగా మార్చిన ఓ ఉద్యమం అని చెప్పవచ్చు. దశాబ్దాలుగా కరువుతో ఎండిపోయిన నేలలు, ఇంకిపోయిన భూగర్భ జలాలు, వర్షాలు లేక పంటలు పండించేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. వీటన్నింటికీ పరిష్కారాన్ని చూపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ‘వానలు వాపస్ రావాలి.. కోతులు వాపస్ పోవాలి..’ అన్న సీఎం నినాదంతో ముం దుకు సాగుతున్న కార్యక్రమంతో గజ్వేల్ పట్టణ రూపురేఖలు మారిపోయాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చదనంతో ఆకట్టుకుంటున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో 2015 నుంచి ఏడు విడుతలుగా హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఆ మొక్కలన్నీ ప్రస్తుతం వృక్షాలుగా మారి పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
సీఎం నాటిన మొక్కలకు మూడేండ్లు..
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సీఎం కేసీఆర్ నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారా యి. 2018 ఆగస్టు ఒకటిన నాలుగో విడుత హరితహారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా లక్ష మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజ్ఞాపూర్‌లోని భారతమ్మ ఇంట్లో కొబ్బరి మొక్కను నాటారు. అదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆయనతో పాటు కొబ్బరి, జామ, దానిమ్మ, సపోట తదితర పండ్ల మొక్కలను నాటారు. గజ్వేల్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా ఇందిరాపార్కు వద్ద సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఎదుట ఉన్న కోటమైసమ్మ రహదారిలో కదంబ మొక్కలను నాటారు. సమీకృత మార్కెట్ ఎదుట రహదారితో పాటు గజ్వేల్ పట్టణానికే ఈ కదంబవృక్షాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. తెలంగాణకు పచ్చని హారంగా మారిన హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ హరిత నిధిని (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుక్రవారం జరిగిన అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచనను ప్రజలు స్వాగతిస్తున్నారు.
హరితనిధిని స్వాగతిస్తున్నాం..
హరితహారంతో గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అత్యంత అద్భుతంగా గజ్వేల్ పట్టణాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో మొక్కలు ఎదిగి తోరణాలుగా స్వాగతం పలుకుతున్నాయి. వందేండ్ల క్రితం నాటి పచ్చటి పల్లెలను చూసే అవకాశం హరితహారం వల్లే కలిగింది. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన హరితనిధిని ఉద్యోగులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వాగతిస్తున్నారు.