
చేర్యాల, అక్టోబర్ 3 : కొమురవెల్లి మల్లన్న గుట్ట పైభాగంలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మల్లన్న క్షేత్రానికి వచ్చిన భక్తులు ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయం వద్ద ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు శ్రద్ధ వహిస్తున్నాయి. నూతనంగా మండపం నిర్మించడంతోపాటు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు, అర్చకులు తీర్మానించారు. దేవాదాయశాఖ స్తపతి వల్లినాయకం సూచనల మేరకు మల్లన్న ఆలయ అధికారులు తమిళనాడులోని మహాబలిపురంలో కృష్ణశిలతో ఎల్లమ్మ విగ్రహాన్ని తయారు చేయించారు. ఆలయ నిధులు రూ.3.20లక్షల వ్య యంతో తయారు చేయించిన అమ్మవారి విగ్రహం ఇటీవల మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి పూజలు చేస్తున్నారు. నవంబరు రెండో వారంలో శైవ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు అమ్మవారి విగ్రహానికి వెండి తొడుగు సైతం తయారు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
వెండి తొడుగులతో ఆలయానికి మరింత శోభ
చేర్యాల, అక్టోబర్ 3 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆలయ ద్వారాలకు వెండితో తొడుగులు ఏర్పాటు చేయిస్తున్నామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. ఆదివారం వెండి తొడుగులు పనులను ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకుడితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి ఆలయంలోని గర్భాలయంలో ద్వారంతో పాటు అర్ధమండపంలోని రెండు ద్వారాలు, తలుపులకు వెండితో తయారు చేసిన తొడుగులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న మిశ్రమ వెండి 11క్వింటాళ్ల వెండిని రూ.16లక్షల వ్యయంతో శుద్ధి చేయించి అందులో నుంచి వచ్చిన శుద్ధమైన వెండి 5 క్వింటాళ్ల 20 కిలలో తలుపులు, ద్వారాలకు వెండితో చేసిన డిజైన్లను అతికించే పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇతర ఆలయాల్లో లేని విధంగా ఎక్కువ వెండిని వెచ్చించి తొడుగులు చేయిస్తున్న ఆలయంగా కొమురవెల్లికి పేరుగాంచనుందన్నారు. శైవ సంప్రదాయం మేరకు ద్వారాలు, తలుపులకు డిజైన్లు తయారు చేయిస్తున్నామని, శివాలయాల్లో ఉండాల్సిన విధంగా వెండి తొడుగులను టెండరుదారులు డిజైన్లు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయంలోని ద్వారాలకు, తలుపులకు కమలం, పద్మాలు, ఆకులతో కూడిన పువ్వులు తదితర డిజైన్లు తయారు చేశారని శీఘ్రగతిని పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ద్వారాలు పెద్ద సైజులో ఉండడంతో అదేస్థాయిలో వెండితో తయారు చేసిన తొడుగులు తదితర వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు సాగుతున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేయించడంతో పాటు కావాల్సిన అనుమతులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దేవాదాయ రాష్ట్ర కమిషనర్ అనిల్‌కుమార్‌తో ఇప్పించినట్లు తెలిపారు. పనులు పరిశీలించిన వారిలో ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు చింతల పర్శరాములు, బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, పొతుగంటి కొమురవెల్లి తదితరులు ఉన్నారు.