
అర్హులైన రజకులు, నాయీబ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ కృషితో కులవృత్తులకు పూర్వ వైభవం
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేటలో లాండ్రీ షాప్‌ను సందర్శించి రజకుడి యోగక్షేమాలు ఆరాతీసిన మంత్రి
రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ వరం లాంటిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని భరత్‌నగర్‌లో మల్లయ్య అనే రజకుడి ఇస్త్రీ షాపును ఆయన ఆకస్మికంగా సందర్శించి కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ సరఫరాతో లక్షలాది మంది రజకులు, నాయీబ్రాహ్మణుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తెస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 2 : రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ ఒక వరం లాంటిదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని భారత్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ తరువాత అక్కడే ఉన్న మల్లయ్య ఇస్త్రీ షాపును మంత్రి సందర్శించారు, వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఏం మల్లన్న నీ లాండ్రీ షాపులో ఇస్త్రీ గిరాకీ ఎట్లుంది.. ఏమన్న పడ్తలు పడుతున్నాయా.. అంటూ మల్లయ్య, అతడి కొడుకు మహేశ్‌ను పలకరించి ఆరాతీశారు. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని జెర సంబురంగా ఉన్నాం సార్ అంటూ, అప్పట్లో వచ్చిన పైసలన్నీ బొగ్గుల పెట్టెకే రూ.1200 నుంచి 1300 వరకు ఖర్చు పెట్టేవాళ్లం, వానొస్తే బొగ్గులు చల్లబడి ఇస్త్రీ పెట్టెకు ఇబ్బంది అయ్యేది. దోబీలకు 250 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వడంతో బొగ్గుల పెట్టె తిప్పలు, సమయం వృథా ఇబ్బందులు తప్పినయ్. 24 గంటల కరెంట్ ఉండడంతో ఇస్త్రీ మంచిగా చేసుకునే సౌలత్ వచ్చిందంటూ సంబురంగా తెలిపారు. ఇప్పటికి ఎన్ని యూనిట్లు కరెంట్ కాలిందని మంత్రి ఆరా తీయగా, వారం రోజులైంది సార్ 48 యూనిట్లు కాలింది. ఇంకా 202 యూనిట్లు వాడుకోవచ్చునని మంత్రి హరీశ్‌రావుకు మల్లయ్య కుమారుడు మహేశ్ తెలిపారు. 250 యూనిట్లు సరిపోకపోతే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అదనంగా పెంచే యోచన చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్ నిర్ణయం ద్వారా వృత్తిదారులకు శారీరక శ్రమ తగ్గి ఆర్థిక వెసులుబాటు కూడా కలిగిందన్నారు. దోబీ, లాండ్రీల కోసం జిల్లా వ్యాప్తంగా 280 రజకులు లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తున్నదని, కరెంట్ కట్ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. నాయీబ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ నిబంధనలు వీరికి మినహాయించిందని తెలిపారు. షాపుతో పాటు ఇంటి వద్ద పనిచేసే రజకులకు, నాయీబ్రాహ్మణులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేసిందని మంత్రి తెలిపారు. లాండ్రీషాపులు, సెలూన్లకు ఉచిత విద్యుత్ స్కీమ్ కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని అన్నారు. మంత్రి వెంట కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్, నాయకులు ఉన్నారు.