
సిద్దిపేట, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విస్తారంగా కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఎటుచూసినా జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి. దీంతో నీటి వనరుల వద్దకు సందర్శకుల తాకిడి పెరిగింది. సెల్పీలు దిగేందుకు పోటీపడుతున్నారు. ఈత కొడుతూ సందడి చేస్తున్నారు. పిల్లలు పోటీపడి చెరువులు, బావులు, చెక్‌డ్యామ్‌లు, కాల్వల వద్ద డైయింగ్ చేస్తున్నారు.
ఓ కంట కనిపెట్టాలి…
సరదా మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనెల 6 నుంచి దసరా సెలవులు వస్తున్నాయి. పిల్లలు చెరువు గట్లకు, కాల్వల వెంట వెళ్తుతుంటారు. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 7,622 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా అన్ని చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు జలాలతో కళకళలాడుతున్నాయి. వీటి ప్రధాన కాల్వల్లో సైతం నీరు పారుతున్నది. ఇవి చాలా లోతులో ఉంటాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, హల్దీ, కూడవెల్లి, మోయతుమ్మెద వాగులు నిండుగా పారుతున్నాయి. మెదక్ జిల్లాలో ఘనపురం వనదుర్గా ఆనకట్ట, హల్దీ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టులు మత్తళ్లు దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మంజీరా, సింగూరు ప్రాజెక్టులు, మంజీర నది, నక్కవాగుతో పాటు ఇతర అన్ని నీటి వనరుల్లో పూర్తిగా జలాలతో ఉట్టిపడుతున్నాయి. దీంతో పర్యాటకులు, సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్లో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. జలాల సెల్పీ ఫొటోలు దిగడం, చేపల పట్టడం, అలుగు పారుతున్న దృశ్యాలను చూడడం, వాగుల నీటి ప్రవాహాలను తిలకించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దసరా సెలవుల్లో దూరంగా ఉండి చదువుకున్న విద్యార్థులు సెలవుల్లో ఊళ్లలోకి చేరుకుంటారు. సరదాగా చెరువుల్లో ఈత కొట్టాలనుకోవడం మామూలే. అయితే ఈత రాకుండా, సరైన పర్యవేక్షణ లేకుండా చెరువుల్లో, బావుల్లో ఈత కొట్టడమంటే సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఈత కొట్టడం ఎవరికైనా సరదానే..అదే సరదా అనేక మంది ప్రాణాలు తీస్తున్నది. చెరువులు, కాల్వల్లో ఈత కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. చిన్నారులు, యువకులు ఎలాగైనా ఈత నేర్చుకోవాలనే మొండి పట్టుదలకు పోయి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. సరదాతో కూడా విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.
అనర్థాలు వివరిస్తే మేలు…
చెరువులు, బావుల దగ్గర అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలకు అవకాశం కల్పించినట్లే. తెలిసీ తెలియని వయస్సులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లడం అంత శ్రేయస్కారం కాదు. పెద్దలు లేకుండా బావులు, చెరువుల వద్దకు వెళ్తామని పిల్లలు మారం చేసినా ఏమాత్రం అనుమతించకూడదు. వారిని గట్టిగా మందలిస్తే చెప్పకుండా వెళ్లరు. ఒంటరిగా వెళ్లడంతో జరిగే అనర్థాలను వివరించాలి. వీలు చిక్కినప్పుడల్లా పెద్దలే ఈతకు తీసుకెళ్లి నేర్పించాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి
ఈత నేర్చుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ట్యూబ్‌లు, బెండ్లు వాడుతున్నప్పటికీ సరైన శిక్షకులు లేకుండా చెరువులోకి దిగడం శ్రేయస్కరం కాదు. సాధ్యమైనంత వర కు పిల్లలతో తల్లిదండ్రులు లేదా పెద్దవారిని పంపించాలి. పురాతన బావులు, చెరువుల్లో బురద, నీటి మొక్కలు తీగలు ఉంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అందులో చిక్కుకుని మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదు. -ఈత నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు పోటీపడి చెరువులు, బావుల్లో డైయింగ్ చేస్తుంటారు. ఒకవేళ రాళ్లు ఉన్న చోట దూకితే.. అంతే సంగతులు. అడుగు భాగం ఎంత లోతు ఉన్నదో తెలియని పరిస్థితి, ఎక్కడ ఏం పొంచి ఉందో తెలియదు. అందుకే ఈత నేర్చుకునే చెరువు, బావులు ఎక్కడ ఎంత లోతున ఉన్నా యో తెలుసుకోవడం అన్నింటికన్నా ప్రధానమైంది.
ఇప్పుడిప్పుడే ఈత నేర్చుకునే పిల్లలు బావుల్లో దొంగా పోలీసు ఆడటం అంత మంచిది కాదు. పై జాగ్రత్తలు పాటిస్తే ఈత సరదా విషాదం కాకుండా మంచి ఆటవిడుపుగా, వ్యాయామం గా, ఇతరుల ప్రాణాలు కాపాడే సాధనంలా బాగా ఉపయోగపడుతుంది.
చెరువు స్నానాలతో జాగ్రత్త
ప్రమాదాలు ఎక్కువగా చెరువు, ఈత స్నానానికి వెళ్లిన సమయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువుల పూడికతీత పనులు చేపట్టడంతో చాలావరకు చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. కొన్నిచోట్ల చెరువుల్లో పెద్ద గుంతలు ఉన్నాయి. అలాంటి సమయంలో చెరువులోకి నీరు చేరగానే అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ అర్థం కాదు. ఈతకు, స్నానానికి చెరువులోకి దిగగానే ఒకే సారి లోతులోకి వెళ్లి ప్రాణాలు వదులుతున్నారు. ఈ కారణంగా చెరువులోనికి ఈత, స్నానానికి వెళ్లే సందర్భాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇలాంటి చోట అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే కొంత వరకైనా ప్రమాదాలను నివారించవచ్చు.
రక్షించండిలా..
నీటిలో మునుగుతున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఈతలో ప్రావీణ్యం ఉండాలి. నీట మునుగుతున్న వ్యక్తిని తాను రక్షిస్తానని దగ్గరకు వచ్చినప్పుడు తనను ఎట్టి పరిస్థితిలో పట్టుకోవద్దని హెచ్చరిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. లేకపోతే రక్షణకు పోయి ప్రమాదంలో చిక్కుకుంటారు. మునుగుతున్న వ్యక్తి దగ్గరకు అతని వెనుక నుంచి వెళ్లాలి. బాధితుడు సహకరించినప్పుడు దూరం నుంచే అతని వెంట్రుకలు పట్టుకుని ఒడ్డుకు ఈడ్చుకు రావాలి. ఒకవేళ బాధితుడు రక్షించే వ్యక్తిని ముందు భాగం నుంచి పట్టుకున్నైట్లెతే అతని రెండు మోచేతులను బలంగా పైకి ఎత్తుతూ నీటిలోకి మునిగి తనను తాను రక్షించుకోవచ్చు. ఈతరాని వారు నీటిలో మునుగుతున్న వ్యక్తి ఒడ్డుకు దగ్గరలో ఉంటే టవల్, చీరె, తాడు లాంటి వాటిని అతనికి అందించి ఒడ్డుకు లాగాలి. నీటి ఒడ్డు సమీపంలో మునిగిపోతున్నప్పుడు ధైర్యంగా బాధితుడిని చెంతకు చేర్చాలి. ఒడ్డున ఉన్నవారు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేర్చాలి.
రక్షణ చర్యలు అవసరమే..
చెరువులు, నదులు, నీటి కుంటల్లో స్నానాలు, ఈతకు వెళ్లే సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో 5 అడుగులు లోతు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నదులు నీటి గుండాలతో పాటు నిత్యం ప్రమాదాలు సంభవించే చోట లైఫ్ సేవింగ్ పరికరాలు నిష్ణాతులను అందుబాటులో ఉంచాలి. కొత్త ప్రదేశాల్లో ఈత కొడుతున్న వారు డైయింగ్ చేయడానికి ముందు ఒక కర్ర సాయంతో అక్కడి లోతును పరిశీలించాలి. అవసరమైతే ఆ ప్రాంత వాసులను అడిగి తెలుసుకోవాలి.
ప్రథమ చికిత్స ఇలా..
నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చాక మొదట పడుకోబెట్టి అతడి మొహాన్ని పట్టి నోటిని తెరిచి శుభ్రం చేయాలి. శ్వాసను పరీక్షించాలి. శ్వాస కోసం పలుసార్లు నోటిలో నోరు పెట్టి ఊదాలి. ఎడమ, కుడి చేతిని భూమికి ఆనించి బాధితుడి ఛాతిపై ఒత్తాలి. దీంతో ఊపిరితిత్తుల నుంచి వెలుపలికి శ్వాస మార్గం మెరుగుపడుతుంది. ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని దవాఖానకు తరలించాలి.