
తెలంగాణ ఆడబిడ్డలకు పీతిపాత్రమైన పండుగ బతుకమ్మ. మన ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ పండుగను పురస్కరించుకొని ప్రతి పేద మహిళకు చీరెను బతుకమ్మ సారెగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఈసారి శనివారం నుంచి బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల ప్రతినిధులు, రేషన్ డీలర్లు, మెప్మా సిబ్బంది కలిసి అర్హులకు చీరెలు పంపిణీ చేస్తారు. సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పంపిణీ ప్రారంభిస్తారు. 18 ఏండ్ల్లు పైబడి ఉండి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళకు చీరెను ప్రభుత్వం అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 10,84,457 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆడబిడ్డలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిభింభించే ఈ పండుగకు ప్రతి పేద మహిళకు చీరెను బతుకమ్మ సారెగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుకను అక్టోబర్ 2 నుంచి పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి గానూ గ్రామాలు, పట్టణాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల ప్రతినిధులు, రేషన్‌డీలర్లు కలిపి అర్హులకు చీరెలు పంపిణీ చేస్తారు. సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పంపిణీని చేపడతారు. తెలంగాణ ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న పండుగ. కుటుంబబంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతి ఆడపడుచు మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకొని బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగను మరింత సంతోషంగా జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రతి పేద మహిళకు బతుకమ్మ చీరెను అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలకు చీరెలు వచ్చాయి.
అందరూ చిరునవ్వుతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం
రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాలను సమానంగా చూస్తున్నది. ముస్లింలు, క్రైస్తవులకు వారి పండుగల సందర్భంగా ప్రభుత్వం కొత్త బట్టలను ఏటా అందిస్తున్నది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారెను అందజేస్తున్నది. బతుకమ్మ తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న పండుగ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ఉమ్మడి జిల్లాలో అర్హులైన మహిళలందరికీ చీరెలు అందజేస్తాం. రాష్ట్రంలో అందరూ చిరునవ్వులతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలని బతుకమ్మ చీరెలను ప్రభుత్వం అందిస్తున్నది.
-తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,84,457 చీరెలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 18 ఏండ్ల పైబడి ఉండి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ పండుగ సారెను సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10,84,457 మంది మహిళలు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 3,80,127 చీరెలు, మెదక్ జిల్లాలో 2,82,330, సంగారెడ్డి జిల్లాలో 4,22,000 చీరెలు పంపణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిందరికీ అందించేందుకు ఆయా జిల్లాల్లోని గోదాములకు బతుకమ్మ చీరెలు వచ్చాయి. 90 శాతం పైగా చీరెలు అందుబాటులో ఉన్నాయి. గోదాముల నుంచి గ్రామాలకు చీరెలను తరలిస్తున్నారు. ఈనెల 2 (శనివారం) నుంచి పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి బతుకమ్మ చీరెలు సరికొత్త రంగుల్లో ఉన్నాయి. తీరొక్క పువ్వోలే.. రంగులో చీరెలు ఆడపడుచులను ఆకట్టకునేలా ఉన్నాయి.17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను తయారు చేశారు. చీరెలు ఈసారి మరింత ప్రత్యేకతను తీసుకు రానున్నాయి. బతుకమ్మ చీరెల పంపణీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ప్రభుత్వం సూచించింది.