
అధిక వర్షాలను అధిగమిద్దాం
వ్యవసాయ అధికారుల సూచనలతో పంటలను కాపాడుకుందాం
సంగారెడ్డి జిల్లాలో 11 వేల 73 ఎకరాల్లో పంట నష్టం
ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 8 : కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో 11వేల 73 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నెల 6వ తేదీన 5,690 ఎకరాల్లో పంట నష్టం జరుగగా, 7వ తేదీన కురిసిన వర్షానికి మరో 5,383 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు లెక్క తేల్చారు. మొత్తం 11,073 ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా వేస్తూ వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈసారి పెద్దఎత్తున పత్తి పంట సాగవుతున్నది. 3 లక్షల 93 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తుండగా, 98 వేల ఎకరాల్లో కంది, 75 వేల ఎకరాల్లో వరి పంటను పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆయా పంటలకు నష్టం వాటిల్లుతున్నదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అయితే, అధిక వర్షాల నుంచి తమ పంటలను కాపాడుకోవచ్చని, అందుకు రైతులు వ్యవసాయ విస్తరణాధికారుల సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు పేర్కొన్నారు. జిల్లాలో ముంపునకు గురైన పంటలను కాపాడుకునేందుకు పాటించాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ సహకారంతో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
రైతులు పాటించాల్సిన సూచనలు..
ముందుగా భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల నుంచి మురుగు నీటిని తీసివేయాలి. అందుకోసం అవసరమైన కాల్వలు తయారు చేసుకొని మురుగు నీరు పోయేవిధంగా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలి. జిల్లాలో పండిస్తున్న ప్రధాన పంటలైన పత్తి, వరి, కంది, మొక్కజొన్నను ఏ విధంగా కాపాడుకుందామనే అంశాలపై అవగాహన పెంచుకుందాం.
కంది పంటకు పాటించాల్సిన నియమాలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోపాప్తొరా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున, కంది రైతులు ఈ తెగులును గమనించిన చోట తెగులు వ్యాప్తి నివారణ కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుపచ్చ తెగులు నివారణ కోసం 1 గ్రాము కార్బొండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత 10 గ్రాముల మల్టీ-కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించండి
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లుతున్నది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధిక వర్షాల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల సూచనలు పాటించాలి. ఎప్పటికపుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటిస్తూ తమ పంటలను కాపాడుకోవాలి. జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించాం.
-నర్సింహారావు, వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి
మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటల్లో..
జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంటల్లో మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలు ఉన్నాయి. మొక్క జొన్నకు సంబంధించి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎర్వినియ ఎండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణ కోసం 100 కిలోల వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ కలిపి పొలమంతా చల్లుకోవాలి. సోయా చిక్కుడు పంటకు సంబంధించి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆకుపచ్చ తెగులు ఆశించేందుకు అవకాశం ఉంది. నివారణ కోసం 2.5 గ్రాముల కార్బెండజిమ్తో పాటు మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జిల్లాలో కూరగాయలు పండిస్తున్న రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆకుపచ్చ తెగులు ఆశించేందుకు అవకాశం ఉన్నందున, నివారణ కోసం 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 1 మిల్లీ గ్రాము ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
పత్తి పంటను కాపాడుకునే విధానం
అధిక వర్షాల నుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు పాటించాల్సిన సూచనలు ఈ విధంగా ఉన్నాయి. అధిక వర్షాలు కురిసినప్పుడు ఆకాశం మేఘావృతమైనప్పుడు పత్తి పంటలో వడలు అనే తెగులు సోకుతుంది. ఈ తెగులును రైతులు గమనించి నివారించాలి. అందుకోసం 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటిలో కలిపి మొక్క వేర్ల చుట్టూ నేలను తడపాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కాయ కుళ్లు తెగులు సోకేందుకు అనుకూలంగా ఉన్నందున నివారణ కోసం 10 లీటర్ల నీటికి ఒక గ్రాము పొషామైసిన్ లేదా ఒక గ్రాము స్ట్రైప్టోసైక్లిన్ మందును కలిపి 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఆకుపచ్చ తెగులు, రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఒక గ్రాము కార్బెండజిమ్, 1.5 గ్రాముల ఎసిపిట్ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తి పంటలో గూడు రాలేందుకు అనుకూలంగా ఉన్నందున, నివారణ కోసం 2 మిల్లీ మీటర్ల ప్లానోఫిక్స్ మందును 5 లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత పైపాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 35 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పత్తి పంటలో నెలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల మల్టీ-కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.