
ఓ అన్నా.. నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం.. చెల్లి.. అన్న.. పిలుపు కోటి వీణలను కలుపు.. అని పాడుతున్న మదిలో తియ్యని మమకారం, ఆత్మీయత మనస్సులో పెనవేసుకుంటుంది. మల్లెకన్నా తెల్లనైన అన్నాచెల్లెళ్ల అనురాగానికి రక్షాబంధన్ ప్రతీక. కాలంతోపాటు సమాజంలో మానవ సంబంధాల్లో మార్పులు వస్తున్నాయి. అన్ని బంధాలు వ్యాపారాత్మక పంథాలో కొడిగొట్టుకపోతున్నాయి. అన్నాచెల్లి, అక్కాతమ్ముళ్ల మధ్య విడదీయరాని బంధం ఉంటుందని గుర్తు చేసే మధురమైన అనుభూతికి రక్షాబంధన్ నిదర్శనం. ప్రతీయేటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమికి వయోభేదం, పేదాగొప్ప తేడా లేకుండా తమ సోదరుల చేతికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ. ఇలా ఏడాదికోరోజు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని, అందులో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడంలో ఉండే అనుభూతి ఎంతో గొప్పది.
చరిత్ర పుటల్లో..
పురుషోత్తముడిని అలెగ్జాండర్ భార్య సోదరుడిగా భావించి, పతి భిక్ష పెట్టాలని రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్తను చంపవద్దని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా, అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు. అప్పటి నుంచి ఆ సాంప్రదాయమే కాలక్రమేనా మార్పులు చెందుతూ ఇప్పటికీ సోదర ప్రేమకు తర్కనంగా రక్షాబంధన్ భాసిల్లుతున్నది. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలకు, అన్నాచెల్లెళ్ల అనురాగానికి ఈ పండుగ ఒక నిదర్శనంగా నిలుస్తున్నది. ఎక్కడ ఉన్నా సోదర ప్రేమను మరువరాదని, కష్టసుఖాల్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఆపదలో ఆదుకోవాలనేదే ఈ పండుగ జరుపుకోవాలని అసలు పరమార్థం.
ఎలా ప్రారంభమైందంటే..
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఓ ఉపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని, భర్త దేవేంద్రుడు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి, ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.
అన్నా చెల్లెళ్ల ఆత్మీయతకు నిదర్శనం..
అన్నా చెల్లెల్ల అనుబంధం, ఆత్మీయతకు నిదర్శనం రక్షాబంధన్. తల్లి పేగు పంచుకొని పుట్టి ప్రేమను పంచేది సోదరి. ప్రతి సారి రాఖీ పండుగను ఇష్టంగా జరుపుకుంటాం. శ్రావణ మాసంలోవచ్చే రాఖీ పండగ మరోసారి అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. సంస్కృతి, సంప్రదాయలకు రాఖీ పండుగ ప్రతీక.
పెద్ద ఎత్తున వెలసిన దుకాణాలు..
జిల్లా కేంద్రం మెదక్‌తో పాటు రామాయంపేట, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, పెద్దశంకరంపేట, టేక్మాల్‌తో పాటు ఇతర మండలాల్లో రాఖీ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి. ఆకర్షనీయమైన రంగులు, డిజైన్లు, వివిధ రకాల సైజులతో రాఖీలు కనువిందు చేసేలా ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజుల నుంచి మహిళలు రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. అన్నివర్గాల వారికి అందుబాటులో
ఉండేలా ఒక్కో రాఖీ ఒక్క రూ.10 నుంచి రూ.200 వరకు
విక్రయిస్తున్నారు.
రాఖీ వచ్చిందంటే ఇల్లంత సందడే..
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. ఎంతో సందడి నెలకొంటుంది. ఎంత దూరంలో ఉన్న సరే తమ సోదరులు రాఖీ కట్టించుకోవడం కోసం గ్రామానికి చేరుకుంటారు. సోదరీసోదరుడికి రాఖీకట్టడం.. సోదరుడు సోదరీకి బహుమతి ఇవ్వడం ఎంతో గొప్ప అనుభూతినిస్తుంది.
సోదర.. సోదరీ ప్రేమకు ప్రతిరూపం
మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతి రూపంగా నిలిచే రక్షబంధన్ సంప్రదాయబద్ధమైన భారతీయ విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కసోదరీ సోదరుడికి రాఖీకట్టి, తాను జీవితాంతం సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది.
హరిత, రాయికోడ్ డివిజన్ వ్యవసాయ అధికారిఉపాధ్యాయుల వృక్షాబంధన్..
సంగారెడ్డి కలేక్టరేట్, ఆగస్టు 21 : రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని శనివారం స్థానిక పోతిరెడ్డిపల్లిలోని జడ్పీహెచ్ఎస్లో వృక్షాబంధన్ నిర్వహించారు. హెచ్ఎం జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని అన్ని మొక్కలకు ఉపాధ్యాయులు రాఖీలు కట్టారు. యేటా రక్షాబంధన్‌తో పాటు వృక్షాబంధన్ కూడా జరుపుకోవాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షిత: అంటూ వృక్షాలను కాపాడాలని, మానవ మనుగడను రక్షించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లావణ్య, పుణ్యానాయక్, నాగేశం, సీఆర్పీ శేఖర్, దివ్యా తదితరులు ఉన్నారు.