
గ్రాన్యూల్స్ సీఎండీకి గౌరవ డాక్టరేట్
1300 విద్యార్థులకు పట్టాల ప్రదానం
అత్యుత్తమ ప్రతిభను చాటిన 13మందికి బంగారు పతకాలు
పటాన్చెరు, ఆగస్టు 28: గీతం, హైదరాబాద్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12వ స్నాతకోత్సవం కన్నుల పండువలా జరిగింది. సంప్రదాయబద్ధంగా గీతం ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పట్టు వస్ర్తాలు, ధోతిలను ధరించి, వేదికకు రాగా, పండుగ శోభను తలపించింది. ఈ వేడుకలో గ్యాన్యూల్స్ ఇండియా లిమిటెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ)ని ప్రదానం చేసి, జ్ఞాపికను అందజేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యూమానిటీస్ కోర్సులు పూర్తి చేసిన దాదాపు 1300 మంది పట్టభద్రులకు డిగ్రీలు, 13మంది టాపర్లకు బంగారు పతకాలు అందజేశారు. గీతం ప్రాంగణంలో పట్టాలను అందుకునేందుకు వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతో గీతం ప్రాంగణం కళకళలాడింది. ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా, పట్టాలు అందుకున్న విద్యార్థుల హిప్హాప్ హుర్రె నినాదాలు మార్మోగిపోయాయి. సుధీర్ఘ విరామం తర్వాత కలిసిన విద్యార్థులు సందడి చేశారు. విద్యాలయంలో తాము నేర్చుకున్న అంశాలు, అధ్యాపకులతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పట్టాలను తీసుకున్న ఆనందంలో విద్యార్థులు ఆకాశమే హద్దుగా సంబురాలు చేశారు. సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, కార్యదర్శి ఎం.భరద్వజ, వీసీ ప్రొఫెసర్ కే.శివరామకృష్ణ, ప్రోవీసీలు ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, ప్రొఫెసర్ డీ.సాంబశివరావు, రిజిస్ట్రార్ డీ.గుణశేఖరన్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
74 ఏండ్ల వయసులో పీహెచ్డీ..
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 12వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. డాక్టర్ సుబ్బారావు తలసి, తన 74వ యేట మేనేజ్మెంట్లో పీహెచ్డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు. జీహెచ్బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్‌బాబు, మార్గదర్శనంలో నాయకత్వ శైలి, దాని ఫలితం (ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన)అనే అంశంపై ఆయన పీహెచ్డీ పూర్తి చేశారు.