
జిన్నారం, ఆగస్టు 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఖా జీపల్లి శివారులో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆకుల మమతానవీన్కుమార్ నిర్మించిన పెద్దమ్మ దేవాలయంలో శుక్రవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవీన జీవితానికి అలవాటు పడుతూ ఆలయాలకు వెళ్లడం తగ్గిస్తున్నారని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవాటు చేసుకోవాలన్నారు. ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉం టుందన్నారు. అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఆకుల నవీన్‌కుమార్ సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, ఎంపీటీసీ ఆకుల భార్గవ్, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్, నాయకులు సద్ది విజయభాస్కర్‌రెడ్డి, మహేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఐదుగుళ్ల పోచమ్మ ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు..
రామచంద్రాపురం, ఆగస్టు 27: ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఐదుగుళ్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదుగుళ్ల అమ్మవారి ఆలయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 29న జరుగబోయే అమ్మవారి బోనాల వేడుకను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కరికె సత్యనారాయణ, మల్లేశ్, భిక్షపతి, మానయ్య, కృష్ణాగౌడ్, రాం చందర్ పాల్గొన్నారు.