
పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలు
ఒక్కో వనంలో 27వేల నుంచి 30వేల మొక్కలు
సంగారెడ్డిలో చురుకుగా బృహత్ వనాల పనులు
ప్రారంభానికి సిద్ధమైన గంగాపూర్, చిట్కుల్ వనాలు
మండలానికి నాలుగు మినీ పల్లె ప్రకృతి వనాలు
సంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం బృహత్ పల్లెప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. మండలానికో బృహత్ వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతో పల్లె సీమకు మరింత పచ్చదనం రానున్నది. పదెకరాల విస్తీర్ణంలో 27వేల నుంచి 30వేల మొక్కలను పెంచుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో ఈజీఎస్ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వారం రోజులుగా వర్షాలు కురు స్తున్నందున తిరిగి పనులు సాగుతున్నాయి. 15 రోజు ల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల పనులు కొలిక్కిరానున్నాయి. 25రోజుల్లో జిల్లాలో బృహత్ పల్లెప్రకృతి వనాలు ప్రారంభించేందుకు అవకాశాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 26 మండలాలకు గానూ 25 మండలాల్లో ఈజీఎస్ ద్వారా పల్లెప్రకృతి వనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో బృహత్ పల్లెప్రకృతి వనం పనులను చేపడుతున్నది. ఝరాసం గం మండలం గంగాపూర్, పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామాల్లో వనాలు పూర్తి కాగా, త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. బృహత్ ప్రకృతి పల్లెవనాల నిర్మాణం, నిర్వహణకు రాబోయే రెండేండ్లకు గానూ రూ.41లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు.
చురుగ్గా సాగుతున్న పనులు
జిల్లాలో బృహత్ వనాల పనులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 26 మండలాల్లో ఒక్కో బృహత్ పల్లెప్రకృతి వనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 26 మండలాల్లో భూముల కేటాయింపులు పూర్తికావడంతోపాటు మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమైంది. అందోలు, గుమ్మడిదల, పెద్దగోపులారం (మునిపల్లి), గంగాపూర్(ఝరాసం గం), రాయికోడ్, వెంకటాపూర్(సదాశివపేట) గ్రామా ల్లో ఎనిమిది ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి అం దుబాటులో ఉన్నది. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో వనా లు నిర్మిస్తున్నారు. మిగతా 19 మండలాల్లో పదెకరాల చొప్పున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో 19 గ్రామాల్లో బృహత్ వనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఒక్కో బృహత్ వనాన్ని నాలుగు భాగాలు విభజించి, వేర్వేరు రకాల మొక్కలు నాటుతున్నారు. మధ్యలో పిల్లల ఆట స్థలాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రజలు నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో బృహత్ వనంలో 500 నుంచి 10వేల వరకు మొక్కలు నాటడం పూర్తయింది. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఈజీఎస్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటే పనులు చేపడుతున్నారు.
మండలానికి నాలుగు మినీ పల్లె ప్రకృతి వనాలు
ప్రతీ మండలంలో మినీ ప్రకృతి వనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండలంలోని నాలుగు గ్రామాల్లో మినీ పల్లె ప్రకృతి వనాలను నిర్మించనున్నది. ఐదెకరాల విస్తీర్ణంలో దట్టమైన అడవులు అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకు జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలో నాలుగు గ్రామాలను గుర్తించి, ఐదెఎకరాల్లో ప్రకృతి వనాలను అభివృద్ధి చేయనున్నది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ప్రతి మండలంలో ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్న నాలు గు గ్రామాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వభూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగానే, జిల్లాలోని అన్ని మండలాల్లో నాలుగు చొప్పున 104 మినీ పల్లెప్రకృతి వనాలను నిర్మించనున్నారు.