
మహా నగర శివారు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఔటర్ రింగురోడ్డును కనెక్ట్ చేస్తూ 35 రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.293 కోట్లతో ఎక్స్టెన్షన్ 7, 30 రేడియల్ రోడ్ల పనులు చేపడుతున్నది. ఎక్స్టెన్షన్ 30లో భాగంగా మొత్తం 7.8 కిలోమీటర్ల రోడ్డులో 1.6కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రాగా, 6.2 కిలోమీటర్లు తెల్లాపూర్ పరిధిలోకి వస్తుంది. ఎక్స్టెన్షన్ 7లో భాగంగా తెల్లాపూర్ నుంచి మోకిల వరకు 10.5 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం తెల్లాపూర్ టూ రంగారెడ్డి జిల్లా కొండకల్ వరకు 5.6 కిలోమీటర్ల మేరకు పనులు జోరందుకున్నాయి. గోపన్‌పల్లితండా నుంచి కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు రోడ్డు పనులు ఒకవైపు పూర్తి కాగా, ప్రజల సౌకర్యవంత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. భూముల ధరలు, విల్లాల ధర రూ.కోట్లలో పలుకుతున్నది.
రామచంద్రాపురం, ఆగస్టు 25 : హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతమైన తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పనులతో ఈ ప్రాంతాల దశ మారుతోంది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విశాలమైన రోడ్ల నిర్మాణంతో వేగంగా అభివృద్ధి సాధ్యమవుతున్నది. ప్రభుత్వం నగరంలోని ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ సమస్యలకు చెక్పెడుతున్నది. అందులో భాగంగానే శివారు ప్రాం తాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఔటర్ రింగురోడ్డును కనెక్ట్ చేస్తూ 35 రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.293 కోట్లతో ఎక్స్టెన్షన్ 7, ఎక్స్టెన్షన్ 30 రేడియల్ రోడ్ల పనులు చకచకా సాగుతున్నాయి. శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరత్రా ఉద్యోగులు ప్రశాంత జీవనం కోసం శివారు ప్రాంతాల్లో ఇండ్లు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. భూముల ధరలు, విల్లాల రేట్లు రూ.కోట్లలో పలుకుతున్నాయి.
రేడియల్ రోడ్ల నిర్మాణంతో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీకి కొత్తరూపు వచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలు రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. పేరొందిన అనేక వెంచర్లు ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి. విల్లాలు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణం జోరు గా సాగుతున్నాయి. ఐటీ సెక్టార్‌కు కూతవేటు దూరంలో తెల్లాపూర్ బల్దియా ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఇండ్లను కొనుగోలు చేస్తూ నివాసముంటున్నారు. తెల్లాపూర్ మీదుగా కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు, తెల్లాపూర్ సాయిబాబా ఆలయం నుంచి ఈదులనాగులపల్లి వరకు రెండు రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతుండడంతో కొత్తకళ సంతరించుకుంది. రేడియల్ రోడ్లు రావడంతో ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. తెల్లాపూర్ నుంచి కొల్లూర్ వరకు రేడియల్ రోడ్డు పనులు ఒకవైపు పూర్తికావడంతో వాహనదారులు హ్యాపీగా ప్రయాణం సాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లి తండా నుంచి తెల్లాపూర్ మీదుగా కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెన్షన్ 30 రేడియల్ రోడ్డు ఒక్కటి, తెల్లాపూర్ సాయిబాబా ఆలయం నుంచి ఈదుల నాగులపల్లి మీదుగా రంగారెడ్డి జిల్లా మోకిల వరకు ఎక్స్టెన్షన్ 7 రేడియల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఎక్స్టెన్షన్ 30కి సంబంధించిన రేడియల్ రోడ్డుకు రూ.103కోట్లు, ఎక్స్టెన్షన్7కి సంబంధించి రేడియల్ రోడ్డును రూ.190కోట్లతో చేపడుతున్నారు. ఈ రెండు రోడ్లను ప్రభుత్వం రూ.293 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎక్స్టెన్షన్ 30లో భాగంగా మొత్తం 7.8 కిలోమీటర్ల రోడ్డులో 1.6కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రాగా, 6.2 కిలోమీటర్లు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఎక్స్టెన్షన్ 7లో భాగంగా తెల్లాపూర్ నుంచి మోకి వరకు 10.5 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తెల్లాపూర్ టూ రంగారెడ్డి జిల్లా కొండకల్ వరకు 5.6 కిలోమీటర్ల మేరకు పనులు జోరుగా సాగుతున్నాయి. గోపన్‌పల్లి తండా నుంచి కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు రోడ్డు పనులు ఒకవైపు పూర్తికావడంతో ప్రజలు సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు పనుల్లో భాగంగా అక్కడక్కడ భూమికి సంబంధించిన వివాదాలు ఉండడంతో ఆ ఏరియాలను వదిలేస్తూ క్లియర్‌గా ఉన్న చోట పనులు చకచకా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అధికారులు. రేడియల్ రోడ్డు ఆరు లేన్లుగా నిర్మిస్తున్నారు. డివైడర్, లైటింగ్ సిస్టమ్, ఇరువైపులా ఓపెన్ డ్రైన్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు.
రేడియల్ రోడ్డు ఎక్స్టెన్షన్ 7లో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. తెల్లాపూర్ టూ రంగారెడ్డి జిల్లా మోకిల వరకు రూ.190 కోట్లతో 10.50 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపడుతున్నాం. మోకిల వద్ద కొంత భూ యజమానులతో సమస్యలు ఎదురవ్వడంతో కొండకల్ వరకు 5.6 కిటోమీటర్ల మేర రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పనుల్లో భాగంగా ముందుగా ఒకవైపు పూర్తి చేయిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పనుల్లో వేగం పెంచాం.
-వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి ..
విశాలమైన రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే రెండు రేడియల్ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ భూ యజమానుల నుంచి అభ్యంతరాలు, సమస్యలు వస్తున్నప్పటికీ, వాటికి పరిష్కారం చూపిస్తూ ముందుకు సాగుతున్నాం.
-గూడెం మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రేడియల్ రోడ్ల నిర్మాణంతో ఈ ప్రాంతానికి కొత్తశోభ సంతరించుకున్నది. తెల్లాపూర్ నుంచి కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు ఒకవైపు రోడ్డు పనులు పూర్తికావడంతో ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగుపడింది. తెల్లాపూర్ టూ ఈదులనాగులపల్లి వరకు మరో రేడియల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. రేడియల్ రోడ్ల నిర్మాణంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది.