
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ ఎత్తిపోతలకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి నిధులు, జలాలు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో సంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, రైతుల్లో ఆనందం నెలకొంది. నెలరోజుల్లో టెండర్లు పిలువనున్నారు. ఈ రెండు ఎత్తిపోతలను రూ.4427 కోట్లతో చేపడతారు. అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. గోదావరి జలాలను సింగూరుకు తరలించి అక్కడి నుంచి ఈ ఎత్తిపోతల ద్వారా భూములను తడుపుతారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్/అందోల్/నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లాలోని రైతుల పంట పొలాలకు గోదావరి జలాలు తరలించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించిన విధంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గురువారం పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం వేర్వేరుగా జీవో 36, 37 జారీ చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల సంగారెడ్డి జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వీటి నిర్మాణానికి రూ.4427 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రెండు ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గురువారం పరిపాలనా అనుమతులు జారీచేసింది. త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇరిగేషన్ అధికారుల సమాచారం మేరకు రాబోయే నెలరోజుల్లో టెండర్లు ఆహ్వానించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజలు, రైతుల తరపున వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మారనున్న సాగు స్వరూపం
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణంతో సంగారెడ్డి జిల్లాలో సాగు స్వరూపం పూర్తిగా మారనుంది. జిల్లాలో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ద్వారా అందోలు నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులోకి తరలించి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను ప్రకటించారు. రెండు ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎత్తిపోతల పథకాల ప్రకటించడమే కాకుండా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు త్వరగా పూర్తయ్యేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు, సర్వే ఏజెన్సీలతో మాట్లాడుతూ డీపీఆర్‌లు త్వరగా పూర్తయ్యేలా చూశారు. డీపీఆర్‌లు ప్రభుత్వానికి చేరడంతో ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ ఎత్తిపోతల నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పాటు రూ.4427 కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
సంతోషంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషిచేస్తున్నది.
కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
సీఎం, మంత్రికి ధన్యవాదాలు..
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఈ ఎత్తిపోతల ద్వారా అందోలు నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. తద్వారా నియోజకవర్గంలోని వందలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ ప్రజలు, రైతుల పక్షాన ధన్యవాదాలు.
క్రాంతికిరణ్, ఎమ్మెల్యే అందోలు