
దివ్యాంగుడికి రక్షగా నిలిచిన బొల్లారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు
బ్యాటరీ వీల్‌చైర్ అందజేత
బొల్లారం, ఆగస్టు 22 : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూడకుండా రాఖీ పం డుగ రోజు మంచి పనికి శ్రీకారం చుట్టాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బొల్లారం మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు పైసా సత్యం సామాజిక సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాల్లో నిత్యం ముందుంటాడు. ఆదివారం తన సాఫ్ట్వేర్ మిత్రుడు వంశీతో కలిసి మానవీయతను చాటుకున్నాడు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో నివసించే దివ్యాంగుడైన బుజ్జి మహేశ్ కండరాల క్షీణత వ్యాధితో చిన్నప్పటి నుంచి పూర్తిగా నడవలేక బాధపడుతున్న విషయం తెలుసుకున్నారు. ప్రస్తుతం మహేశ్ ఇస్నాపూర్ మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నా డు. ఆర్థిక స్థితిగతులతో ఇబ్బందులు పడుతున్నాడు. అతడికి అండగా నిలవాలని ఇద్దరు మిత్రులు నిశ్చయించుకున్నారు. రూ.50వేలు విలువ చేసే బ్యాటరీ వీల్ చైర్‌ను దివ్యాంగుడైన మహేశ్‌కు రక్షా బంధన్ సందర్భంగా అందజేసి రక్షగా నిలిచారు. తన నిస్సహాయ స్థితికి స్పం దించి భరోసా కల్పించిన పైసా సత్యం, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వంశీలకు బుజ్జి మహేశ్ రాఖీలు కట్టి ధన్యవాదాలు తెలిపారు.